Pawan Kalyan Interview Highlights: నారా లోకేష్‌తో ఇబ్బంది వల్లే తెలంగాణకు వెళ్తున్నారా? ANI ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సంచలన సమాధానం!
Pawan Kalyan Answers On Nara Lokesh Friction: పవన్ కల్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టడానికి నారా లోకేష్ కారణమా?. అక్కడ నారా లోకేష్ తో ఇబ్బంది కారణంగా తెలంగాణపై దృష్టి పెట్టారా?

Pawan Kalyan Denies Leaving AP For Telangana: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ 'ANI' పాడ్‌కాస్ట్‌లో స్మితా ప్రకాష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో స్మితా ప్రకాష్ నేరుగా ఏపీ రాజకీయాలు, పొత్తుల అంతర్గత సమీకరణాలపై ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు నాయకత్వం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతోందా? ఆ కారణంగానే మీరు ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారా?" అని ఆమె ప్రశ్నించారు.
ఈ ఊహాగానాలకు, రాజకీయ ప్రచారానికి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో అత్యంత స్పష్టతతో కూడిన సమాధానాన్ని ఇచ్చారు. ఈ వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేస్తూ.. "ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ నాయకత్వం వల్ల కానీ, మరొకరి వల్ల కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. నేను తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు.. నా మొదటి ప్రాధాన్యత, నా ఏకైక ఫోకస్ ఎప్పుడూ ఆంధ్రప్రదేశే" అని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సుస్థిరంగా సాగుతోందని, ఇలాంటి ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు.
తెలంగాణపై తానెందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా పవన్ ఈ సందర్భంగా వివరించారు. "నాకు తెలంగాణలో అత్యంత బలమైన క్యాడర్ ఉంది. నేను 2007 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. అంతకుముందు నుంచే నా వెంటే నడిచే కరడుగట్టిన తెలంగాణ యువత నాకు అండగా నిలబడ్డారు. నాకు తెలంగాణ నుండి స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు. కానీ, ప్రాథమిక హక్కులు, జాతీయ విలువల గురించి మాట్లాడే ఒక జాతీయ పార్టీ నాయకులు కొందరు చిల్లర శక్తులను నాపైకి పంపుతూ.. 'నువ్వు హైదరాబాద్‌లో అడుగుపెట్టలేవు.. నువ్వు అవుట్‌సైడర్వి' అని బెదిరించడం వల్లే నేను స్పందించాల్సి వచ్చింది" అని పవన్ పేర్కొన్నారు.
#WATCH | On entering Telangana politics, Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "I was not focusing on Telangana... My primary focus is on Andhra Pradesh, but I am a very strong cadre... I have been in politics since 2007 and even before that, I had staunch Telangana youth… pic.twitter.com/SEYu94csyO
— ANI (@ANI) June 10, 2026
తన మాతృభూమిలో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని నొక్కిచెప్పిన పవన్ కల్యాణ్.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం వెనుక ఏపీ సమీకరణాలు ఉన్నాయనడం కేవలం రాజకీయ అపోహేనని తేల్చేశారు. తాను ఎవరి అనుమతి కోరడం లేదని, నన్ను 'లోపలికి రానివ్వం' అని బెదిరించే వారికి మాత్రమే తాను ఆ సమాధానం ఇచ్చానని చెప్పారు. తన పార్టీ నాయకులు, క్యాడర్ ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతానని, అంతేతప్ప ఏపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని పవన్ కల్యాణ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















