Frank Videos : ఫ్రాంక్ వీడియోస్ పేరుతో పిచ్చి వేషాలు, తిక్క కుదిర్చిన పోలీసులు!
Frank Videos : సోషల్ మీడియా వచ్చాక విచ్చలవిడితనం పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఫ్రాంక్ వీడియోల పేరిట యువత శృతిమిస్తున్నారు. రాత్రి రాత్రికి స్టార్స్ అయిపోదామని కటకటాల పాలవుతున్నారు.
Frank Videos : టెక్నాలజీ పెరగడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్స్ లోనే సమయం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం కూడా అధికం అయింది. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను అప్ లోడ్ చేస్తూ ట్రేడింగ్ కోసం పిచ్చి పిచ్చి ఫ్రాంక్ వీడియోలు చేస్తు్న్నారు. సోషల్ మీడియా వల్ల మరికొందరైతే రాత్రి రాత్రికే స్టార్స్ గా మారిపోతున్నారు. ట్రెండీగా మారేందుకు కొందరు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. దారినపోయే వారితో హద్దులు మీరి ఫ్రాంక్ లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరికొందరైతే బోల్డ్ ఫ్రాంక్స్ చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
పిచ్చి ఫ్రాంక్ లు
ఫ్రాంక్ లు ఇప్పటి వరకూ హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, కోలకతా, దిల్లీ వంటి మహానగరాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పిచ్చి చేష్ఠలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రజలను ఫ్రాంక్ ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న పలువురు యువకులు కటకటాల పాలుచేసింది. మిక్కిమౌస్,టెడ్డీ బేర్ వేషధారణలో వచ్చి కళాశాలలు, పాఠశాల వద్ద యువతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరూ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతం అంతా విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఎటు చూసినా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, రోడ్లపై తినుబండారాలు అమ్మే వారితో నిండిపోతుంది. స్కూల్స్, కళాశాలల నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో ఇద్దరు యువకులు టెడ్డీ బేర్, మిక్కీమౌస్ వేషధారణలో గుడియాత్తం రోడ్డుకి వచ్చేవారు. అప్పుడే స్కూల్స్, కాలేజీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థినులతో ఫ్రాంక్ చేయడం మొదలుపెట్టేవారు. ఆ దారిలో వచ్చే వారిని భయపెట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించి ఒంటిపై చేతులు వేయడం, సైగలు చేయడం, వారి ఫోన్ నెంబర్లు అడగడం, సెల్ఫీలు తీసుకొనే వారు. ఇక పెళ్ళైన ఆడవారిపై, వృద్ధులపై కూడా ఇలానే ఆ యువకులు ప్రవర్తించేవారు. ఫ్రాంక్ లతో మహిళలు, విద్యార్థినిలు, వృద్ధులు భయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎవరూ ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేలోపే ఫ్రాంక్ అంటూ పిచ్చి గంతులు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.
ఈవ్ టీజింగ్
తరచూ యువకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే కొందరు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫ్రాంక్ వీడియో పేరుతో అసభ్యంగా ప్రవర్తించిన కరీముల్లాపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి సహకరించిన మరికొందరిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ కూడా ఇలాంటి వాటితో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ నుంచి వచ్చిపోయే అమ్మాయిలను, మహిళలను ఈవ్ టీజింగ్ చేయరాదని హెచ్చరించారు. అలా చేసిన వారిపై చట్ట రీత్యా తగుచర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని పలమనేరు పోలీసులు హెచ్చరించారు.