Payyavula Letter : ఏపీలో ఆర్టీఐ చట్ట ఉల్లంఘన - తక్షణం జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు పయ్యావుల లేఖ
జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడంపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల సీఎస్ కు లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు.
Payyavula Letter : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయడం లేదని చీఫ్ సెక్రటీరికి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. ఆర్.టి.ఐ చట్టాన్ని తుంగలో త్రొక్కేలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వ్యవహరిస్తున్నాయని లేఖలో వివరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ డిపార్ట్ మెంట్ సమాచారాన్నిపబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సి ఉందన్నారు. కానీ, చాలా ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు తమ వెబ్ సైట్లలో తాజా సమాచారం ఉంచడం లేదని.. దీనిపై అనేకమార్లు పిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. ఆర్.టి.ఐ పై గౌరవ హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదని గుర్తు చేశారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ వెబ్ సైట్ లను అప్ డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పయ్యావుల కోరారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కేంద్ర సమాచార హక్కు చట్టాన్ని అమలయ్యేలా చూడాలని..తక్షణం స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారాని భావిస్తున్నానని తెలిపారు.
జీవోలను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కిందటే జీవోల విషయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీవోలు ఏవీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టడం దాదాపు ఏడాది క్రితం నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీన్ని హైకోర్టు తప్పుబట్టినా ప్రభుత్వానికి లెక్కలేదు. ఏపీ ఇ-గెజిట్ పోర్టల్‌లో అరకొరగా జీవోల్ని అప్‌లోడ్ చేసి మమ అనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఇ-గెజిట్‌లో కూడా, ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం జారీ అయిన జీవోల్నీ... అప్‌లోడ్ చేస్తున్నారు.
హైకోర్టులో పిటిషన్లు పడినా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచడం 2008లోనే మొదలైంది. గత ప్రభుత్వాలు ప్రతి జీవోనీ ఆన్‌లైన్‌లో ఉంచేవి. ‘కాన్ఫిడెన్షియల్’ జీవోలైతే నంబరు మాత్రమే కనిపించేది. అలాంటివి అప్పుడప్పుడూ ఒకటో రెండో ఉండేవి. మిగిలినవన్నీ సాధారణ పౌరులకూ అందుబాటులోకి వచ్చేవి. జీవోల్ని అప్‌లోడ్ చేయడానికి సచివాలయంలో పటిష్ఠమైన వ్యవస్థ ఉండేది. ఏ ప్రభుత్వశాఖ జీవో జారీచేయాలన్నా... మొదట ఆన్‌లైన్ రిజిస్టర్‌లోకి వెళ్లి నంబరు తీసుకోవాలి. నంబరు వచ్చాకే జీవో జారీ చేయగలిగేవారు. దాన్ని ఐటీ విభాగం అప్‌లోడ్ చేసేది. ఒకసారి జీవో అప్‌లోడ్ అయితే... అందరికీ అందుబాటులోకి వచ్చేది. పాత జీవోలు కావాలన్నా వెళ్లి చూసుకునే వెసులుబాటు ఉండేది.
ఆర్టీఐ చట్ట ఉల్లంఘనేనంటున్న విపక్షాలు
కోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ జీవోలు అప్ లోడ్ చేయడం లేదు. ‘భారత రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ ప్రకారం సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు కూడా అదే స్పష్టంచేసింది. ప్రభుత్వం జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచకపోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని విపక్ష నేతలు చెబుతున్నారు. జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో జీవోలు ఉంచకపోవడం, ఏపీ ఇ-గెజిట్ వెబ్‌సైట్‌లో పరిమిత సంఖ్యలో జీవోలు ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై తుది విచారణ పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇదే అంశంపై పయ్యావుల లేఖ రాశారు.