Ongole: ఒంగోలులో నడిరోడ్లపై హైడ్రామా! గన్‌లు ఎక్కుపెట్టిన పోలీసులు, బెదిరిపోయిన జనం - అసలు సంగతేంటంటే
AP News: ఒంగోలు పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. కౌంటింగ్ రోజు హింసాత్మక ఘటనలు జరిగితే వాటిని సమర్థంగా ఎదుర్కోవడం లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
Mockdrill in Ongole: ఏపీలో ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు పరస్ఫరం ఘర్షణ పడడం, మారణాయుధాలు ఉపయోగించి దాడులు చేసుకుంటున్న ఘటనలు సంచలనంగా మారాయి. ఆ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు జూన్ 4న జరగబోయే ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజున కూడా జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఒంగోలు పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు.
హింసాత్మక ఘటనలను సమర్థంగా ఎదుర్కోవడం లక్ష్యంగా ఒంగోలు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని అల్లర్లు జరిగిన సమయంలో పోలీసులు అతి తక్కువ సమయంలో వారిని ఎలా చెదరగొట్టాలో, పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురావాలనే అంశంపై ఈ డ్రిల్ నిర్వహించారు. నిజంగా అల్లర్లు జరిగినప్పుడు ఏర్పడే వాతావరణాన్ని క్రియేట్ చేసి దాన్ని ఎలా అదుపు చేయాలో పోలీసులు చేసి చూపించారు. ఇలాంటి డ్రిల్స్ లో పోలీసులు స్పందించిన తీరు ద్వారా నిజంగా అలాంటి గొడవలు జరిగినప్పుడు సులభంగా పరిస్థితిని నియంత్రించే అవకాశం ఉంటుంది. అల్లరి మూకలు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. తొలిసారిగా ఈ అల్లర్ల నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పారు.
గొడవలు జరిగిన సమయంలో ముందు నార్మల్‌గా వార్నింగ్ ఇస్తామని.. ఆ తర్వాత లాఠీ చార్జీ చేస్తామని ఒంగోలు పోలీసులు చెప్పారు. అప్పటికీ అల్లరి మూకలు వినకపోతే టియర్ గ్యాస్, వాటర్ క్యానాన్స్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తామని చెప్పారు. అయినా పరిస్థితులను అదుపు చేయలేని పక్షంలో మేజిస్ట్రేట్ అనుమతితో తుపాకీలతో ఫైరింగ్ చేస్తామని వెల్లడించారు.
జూన్ 4న జరగబోయే ఎన్నికల ఫలితాల రోజు ఏపీలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో విధ్వంసం జరిగే అంచనాలు ఉన్నాయి. పది రోజుల క్రితం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చాలా జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఉద్రిక్తతపై పోలీసులు 1370 మందిపై కేసులు నమోదు చేశారు.