AP Vs Odisha: కొటియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత... గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ.. ఏపీ, ఒడిశా మధ్య ముదురుతున్న వివాదం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కొటియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం బోర్డులపై స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కొటియా గ్రామాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని కొటియా గ్రామాల్లోని పగులుచిన్నూరు, పట్టుచిన్నూరు, డోలియాంబలో ఒడిశా పోలీసులు, గ్రామస్తులకు మధ్య ఆదివారం సాయంత్రం ఘర్షణ తలెత్తింది. వివాదాస్పద గ్రామాల్లో ఏపీకి చెందిన ఐటీడీఏ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార బోర్డులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం నాలుగు రోజుల క్రితమే ఆయా గ్రామాలకు సామాగ్రి పంపించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో వాటిని అడ్డుకొనేందుకు ఒడిశా పోలీసులు మూడు రోజులుగా గ్రామాల సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. రెండు రోజులుగా ఏపీకి చెందిన అధికారులను గ్రామాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం పగులుచిన్నూరు, పట్టుచిన్నూరు, డోలియాంబ గ్రామాల్లోని స్థానికులు బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒడిశా పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. గ్రామాల్లో గస్తీ ఎందుకు ఉంటున్నారని, తాము ఆంధ్రాలోనే ఉంటామని స్థానికులు ఒడిశా పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒడిశా పోలీసులు కొటియా గ్రామాల్లో నుంచి కదలకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Also Read: శ్రీకాకుళంలో నీలమణి అమ్మవారి దేవాలయం కూల్చివేత... టీడీపీ, జనసేన ట్వీట్... వాస్తవం ఏమిటంటే...?
అసలేంటీ వివాదం
ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న విజయనగరం జిల్లా-కోరాపుట్ జిల్లాల మధ్య 21 గ్రామాలను కొటియా గ్రామాలుగా పిలుస్తారు. సాలూరు నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే కొటియా గ్రామాలు కనిపిస్తాయి. ఈ గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం లేదు. దాదాపుగా 15 వేల మంది నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామాలపై ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాల మధ్య సుదీర్ఘ కాలంగా వివాదం ఉంది. కొటియా పరిధిలోని 21 గ్రామాలు తమవని పోరాడుతూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. 1968లో ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య సమస్య నడుస్తునే ఉంది. 2006లో మాత్రం సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలూ సమన్వయంతో ముందుకు సాగాలని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరగలేదు.
Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్
తెలుగు బోర్డులు కనిపించవు
ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు, సంక్షేమ పథకాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. రెండు రాష్ట్రాలు ఇచ్చే సాయాన్ని ఈ గ్రామాల ప్రజలు తీసుకుంటున్నారు. కొటియా గ్రామాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఆ గ్రామాలు తమవేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నా అక్కడ తెలుగు బోర్డులే కనిపించవు. ఒడిశా ప్రభుత్వ బోర్డులు, భవనాలు కనిపిస్తుంటాయి. కొటియా ప్రాంతంలో భారీ ఎత్తున్న అభివృద్ధి పనులు అక్కడి ప్రభుత్వం చేపడుతూ వస్తోంది. ఆ స్థాయిలో ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇటీవలి కాలంలో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఇటీవల అక్కడ పర్యటించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒడిశా అధికారులు, నేతలు అడ్డుకుంటున్నారు. అదే సమయంలో ఒడిశా చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, విపక్ష నేతలు, ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలకు క్యూకట్టారు.