పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే, నీ భార్య ఉద్యోగం పీకేస్తాం- జనసేన లీడర్‌కు అధికారి బెదిరింపు
NTR District News: జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటే నీ భార్య ఉద్యోగం తీసేస్తానని ఎంఈవో బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై మండిపడ్డ జనసేన.. విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
NTR District News: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఎంఈవో కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్న జనసేన కార్యకర్త కృష్ణ కిశోర్ భార్య శ్రీలతను ఎంఈవో సీహెచ్ రామకృష్ణ బెదిరించారు. జనసేన కార్యకర్త అయిన కృష్ణ కిశోర్ ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. భార్య శ్రీలతను ఒప్పంద ఉద్యోగం నుంచి తీసేస్తామని కృష్ణ కిశోర్ ను ఆఫీస్ కు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు.
"పార్టీలో తిరిగితే ఉద్యోగం పీకేస్తా"
ఈ సంఘటన సోమవారం జరిగింది. అంతలోనే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తనను ఆఫీస్ కు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డ ఘటనపై కృష్ణ కిశోర్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ యాసిన్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎంఈవో ఆఫీస్ కు చేరుకుని ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడుతూ దీనిపై విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎంఈవో సీహెచ్ రామకృష్ణ స్పందించారు. కృష్ణ కిశోర్ ను కార్యాలయానికి పిలిచింది వాస్తవమేనని, కానీ ఆయన్ని బెదిరించిన మాట అవాస్తవం అని తెలిపారు. కృష్ణ కిశోర్ తనను, విద్యాశాఖను అప్రతిష్టపాలు చేస్తూ ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
గత శనివారం రోజున ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. విశాఖ రాజధానికి మద్దతు తెలుపుతూ.. ప్రజా గర్జన కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టు పెద్ద సంఖ్యలో చేరుకున్న జనసేన కార్యకర్తలు మంత్రుల కాన్వాయ్ పై దాడి చేశారు.
అనంతరం మరో కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానని చెప్పు తీసి మరీ చూపించారు. ఇళ్ల నుండి లాక్కొచ్చి మరీ కొడతా నా కొడకల్లారా ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడింది నా సహనమేరా .. నన్ను గొడవల్లోకి లాగితే నాలుక చీరేస్తా. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాకు రాజకీయం తెలియదు అనుకుంటున్నారా.. ఈ రోజు నుండే యుద్ధం మొదలు పెడుతున్నాను అని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఓ పిచ్చిXXX అని.. ఆయన వాగుడుతో అది మరోసారి తేటతెల్లమైందని మండిపడ్డారు. చెప్పుతో కొడతానని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ కల్యాణ్ అని తాను ఇంతకు ముందు చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని అన్నారు. ప్యాకేజీ స్టార్ అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా.. లేక నీ యజమాని కొనిచ్చారా అంటూ పవన్ కల్యాణ్ ను జోగి రమేష్ ప్రశ్నించారు.