గొల్లపూడి టీడీపీ ఆఫీస్ తొలగింపు, వైసీపీ పతనానికి నాంది - దేవినేని ఉమా
గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్నిఖాళీ చేయించారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. టీడీపీ కార్యాలయం తొలగింపుపై దేవినేని ఉమా మండిపడ్డారు.
గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్ని ఎట్టకేలకు పోలీసులు ఖాళీ చేయించారు. భవనాన్ని యజమానులకు అప్పగించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల జోక్యంతో వివాదానికి చెక్ పెట్టారు.
గొల్లపూడిలో ఉద్రిక్తత....
ఉమ్మడి కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన లీజుపై వివాదం జరుగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబ సభ్యుల మధ్య గొడవ తలెత్తడంతో హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. స్థల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు డిసెంబరు 28న తహశీల్దార్ నోటీసులిచ్చారు. అయితే ఈ కార్యాలయాన్ని అధికారులు, పోలీసులు కావాలనే తొలగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల హడావుడి
గురువారం తెల్లవారుజాము నుంచే అధికారులు, పోలీసులు స్థానిక టీడీపీ కార్యాలయాన్నితొలగించడం ప్రారంభించారు. పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఆనుకొని కూర్చునే పసుపురంగు బల్లలు సైతం తొలగించారు. టీడీపీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించడంలేదు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అక్కడకు చేరుకొని నిరసన తెలియజేశారు. కార్యాలయం తొలగింపు నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మొహరించి ఆయన్ను బయటకు రానివ్వకుండా చూశారు.
తెలుగుదేశం పార్టీని అణగదొక్కగలరా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే స్థలంలో కార్యాలయం ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు ఇవ్వగానే తొలగించేశారని, ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం జరగకూడదనే ఇదంతా చేశారని దేవినేని ఉమా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
వైకాపా పార్టీ పతనానికి నాంది
పార్టీ ఆవిర్భావం నుంచి అదే స్థలంలో కార్యాలయం ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు ఇవ్వగానే తొలగించేశారని, ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం జరగకూడదనే ఇదంతా చేశారన్నారు దేవినేని ఉమా. సైకో పాలన అంటే ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ గొల్లపూడి సంఘటన అద్దంపడుతుందన్నారు. 18వ తారీఖున కార్యక్రమాలు ఆపాలని ఏకపక్షంగా కుటుంబ సభ్యులతో కలెక్టర్ కి కంప్లెయింట్ ఇప్పించి దాని మీద 12 గంటలు తిరగకుండానే 145 సెక్షన్ ఇంఫోజ్ చేశారన్నారు. పార్టీ ఆఫీస్ కి తాళాలు వేశారని, రక్తదానం, అన్నదానం రోడ్డు మీద చేసి వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తే తట్టుకోలేక పార్టీ కార్యాలయం రంగులు మార్చారన్నారు. గేట్లకు నల్ల రంగులు వేశారని, ప్లెక్సీలు కూర్చునే బల్లలు ఎత్తుకుపోయారని, కంప్యూటర్, వాహనం అన్ని ఎత్తుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారన్నారు.సైకో కళ్ళలో ఆనందం చూడటానికి వైసీపీ నాయకులు ఏకపక్షంగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని,కార్యక్రమాలను, పార్టీ కార్యాలయం వద్ద ఉన్న వాటిని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. పార్టీ ఆఫీస్ రంగులు మార్చినా, బ్యానర్లు ప్లెక్సీలు తీసేసినా తమ పోరాటం ఆగదన్నారు. ప్రజా వేదిక కూల్చడం దగ్గర మొదలు పెట్టి విధ్వంసాలతో మొదలై గొల్లపూడిలో పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, రంగులు మార్చే వరకు వచ్చిందని, న్యాయస్థానంలో వివాదం ఉంది న్యాయం, ధర్మం గెలుస్తాయని ఉమా వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ పతనానికి, వైకాపా పార్టీ పతనానికి నాంది ఇదని శపథం చేశారు. అవినీతి పరులైన అధికారులను అడ్డం పెట్టుకొని ఈవిధంగా చేస్తున్నారని, ఆ అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నారన్నారు.