AP Pensions: ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
NTR Bharosa: జులై ఒకటో తేదీనే 90 శాతం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 65,18,496 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు.
Andhra Pradesh Pensions: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జులై ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 65,18,496 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను విడుదల చేసింది. వీరిలో 90 శాతం మందికి ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఒకటో తేదీ రోజు పింఛను అందని వారికి 2వ తేదీన కచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు.
పంపిణీ ఆరు గంటలకే మొదలవ్వాలి
జూలై 1వ తేదీ, సోమవారం ఉదయం 6 గంటల కల్లా పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలన్నారు. జులై 1న 90 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి. ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా సదరు అధికారులు విత్ డ్రా చేసుకోవాలన్నారు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు శనివారం రాత్రి కల్లా ఇవ్వలేకుంటే.. అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి సంబంధిత పింఛన్ల మొత్తాన్ని అందజేయాలని బ్యాంక్ అధికారులను సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..
జూలై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. సీఎం ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం పింఛన్ డబ్బులు పెంచడం, ఒకటే తేదీన అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పింఛన్లు..
ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పింఛన్లను రూ. 3,000 నుంచి రూ. 4,000 కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దివ్యాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000కు పెంచుతామని చెప్పింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. పింఛన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో జూలై 1వ తేదీన వృద్ధులు, వితంతవులకు రూ. 4 వేల పింఛనుకు అదనంగా, ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ రూ. 1,000 చొప్పన మొత్తం రూ. 7,000 లభించనుంది. దివ్యాంగులకు పెరిగిన పింఛన్ రూ. 6,000 అందజేయనున్నారు.
ఎన్టీఆర్ భరోసా గా పేరు మార్పు
వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో సామాజిక భద్రత పింఛను పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించనుంది. 2014-19లో అధికారంలో ఉన్న సమయంలో కూడా టీడీపీ ఇదే పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. ఏపీలో మొత్తం 28 కేటగిరిల్లో పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. వృద్ధులు, వింతతువులు, చేనేత వృత్తుల వారు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐపీ బాధితులు, ట్రాన్స్ జెండర్లకు గతంలో ఉన్న రూ. 3 వేల పింఛన్ కు గానూ జూలై 1 నుంచి రూ.4 వేల పింఛన్ పొందనున్నారు. వీరికి కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ రూ. 1,000 చొప్పన మొత్తం రూ. 7,000 లభించనుంది.
ఆగస్టు నుంచి ప్రతి నెల రూ. 4,000 అందుతాయి. దివ్యాంగులకు పింఛన్ రూ. 3,000 నుంచి రూ. 6,000 కు పెరగనుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసేమియా బాధితులు వైసీపీ హయాంలో రూ. 5 వేల పింఛన్ అందుకోగా, జూలై 1 నుంచి ఇది రూ. 10 వేలకు పెరగనుంది. పక్షవాతం, యాక్సిడెంట్లో ప్రమాదానికి గురై కండరాలు పని చేయని బాధితులకు రూ. 5 వేలుగా ఉన్న పింఛన్ జూలై 1 నుంచి రూ. 15,000 కు పెరగనుంది. ఇలా మొత్తం 28 కేటగిరీల్లో 65 లక్షల మందికిపైగా పింఛన్లు పొందుతున్నారు.