YSRCP Laddu Kalti Politics : లడ్డూ కల్తీలో నిండా మునిగిన వైఎస్ఆర్‌సీపీ - లెటర్లు, ప్రమాణాలు వర్కవుట్ కావడం లేదా ?
YSRCP : లడ్డూ కల్తీ అంశంలో వైఎస్ఆర్‌సీపీ మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. వైసీపీ నేతలు ప్రమాణాలు చేస్తున్నారు. జగన్ లేఖలు రాస్తున్నారు. కానీ కేంద్ర టెస్టుల్లోనూ కల్తీ బయటపడటంతో వాటికి విలువ లేకండా పోతోంది.
Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ వివాదం రాను రాను రాజకీయ పెను ప్రకంపనలకు కారణం అయ్యేలా కనిపిస్తోంది. అసలు కల్తీనే జరగలేదని.. అంతా టీడీపీ ప్రచారం అని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓ సుదీర్ఘమైన లేఖ రాసి.. సోషల్ మీడియాలో అందరికీ ట్యాగ్ చేశారు. కైండ్ అటెన్షన్ అంటూ ప్రత్యేకమైన విజ్ఞప్తి కూడా దానికి జత చేశారు. మరో వైపు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేశారు. నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే తన కుటుంబం.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబం నాశనమైపోవాలని ప్రమాణం చేశారు. ఇలా వైసీపీ నేతలు తమకు చేతనైనంత రీతిలో.. అసలు లడ్డూ లో కల్తీ జరగలేదని ప్రయత్నిస్తున్నారు.
ఓ వైపు న్యాయపోరాటం - మరో వైపు ఎదురుదాడి
ఓ వైపు వైసీపీ నేతలు అటు హైకోర్టు.. ఇటు సుప్రీంకోర్టుల్లో వరుసగా పిటిషన్లు వేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాక ముందే మాజీ ఏఏజీ , ప్రస్తుత వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి వైవీ సుబ్బారెడ్డి తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఆయన లాయర్ లాజిక్కులు ఆయన చెప్పారు. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి దేశంలోని ప్రముఖ నాయకులందరికీ లేఖలు రాశారు. అయితే ఆ లేఖలతో పాటు .. కోర్టుల్లో దాఖలు చేస్తున్న పిటిషన్లలో ఎక్కడా సీబీఐ విచారణ అడగడం లేదు. రాష్ట్ర ఏజెన్సీల దర్యాప్తుపై నమ్మకం లేదని చెబుతున్నారు. అలాగని కేంద్ర ఏజెన్సీలపై నమ్మకం వ్యక్తం చేయడం లేదు. కోర్టుల పర్యవేక్షణలో వచారణ జరగాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్రం చేసిన పరీక్షల్లోనూ బయటపడిన కల్తీ - ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు
కేంద్ర ఆరోగ్య శాఖ పరీక్షల్లోనూ తేలిన కల్తీ
కేంద్ర ఆరోగ్య శాఖ లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ నిజమేనని తేల్చింది. లడ్డూ కల్తీ అంశంపై వెంటనే అప్రమత్తమైన కేంద్రం కాంట్రాక్టర్లు తిరుమలకు పంపించిన నెయ్యి శాంపిల్స్ ను సేకరించింది. మొత్తం నాలుగు శాంపిల్స్ ను ల్యాబుల్లో టెస్టులు చేయించారు. నాలుగు శాంపిల్స్ ను పరీక్షిస్తే.. ఒక శాంపిల్ అన్ని టెస్టుల్లోనూ ఫెయిలయింది. పక్కాగా కల్తీ జరిగినట్లుగా నిర్దారించారు. అది ఏ కంపెనీ అన్నది కేంద్ర ఆరోగ్య శాఖ బయట పెట్టలేదు. కానీ ఏ ఆర్ డెయిరీనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో వైసీపీకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. జగన్ రాసిన లేఖలకు పెద్దగా విలువ లేకుండా పోయినట్లు అవుతోంది.
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
ఎదురుదాడి చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా ?
లడ్డూ కల్తీ అంశాన్ని వైసీపీ అధినేత జగన్.. అప్పటి టీటీడీ బోర్డు బాధ్యత అని చెప్పి ఉన్నట్లయితే.. మొత్తం వైసీపీ మీదకు వచ్చేది కాదు. కానీ తిరుమలలో జరిగినదంతా వైసీపీ ఘనతేనని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో. పూర్తిగా ఈ లడ్డూ కల్తీ అంశం వైసీపీకే ముడిపెట్టేస్తున్నారు. జాతీయ మీడియా కూడా.. ఇదే చెబుతోంది. దీంతో వైఎస్ఆర్‌సీపీ వాదనలో బలం ఎక్కడా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు టెండర్ ఇవ్వడం.. దశాబ్దాలుగా సరఫరా చేస్తున్న వారిని పక్కన పెట్టడంతో పాటు టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వారి నేపధ్యం.. అర్హత లేని అధికారులకు అందలం ఎక్కించడం మొత్తం చర్చకు వస్తోంది. ఈ కారణంగా వైసీపీ వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని భావిస్తున్నారు.