Nellore political news : కోటంరెడ్డికీ బాలినేని సమస్యే - సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారట !
తనపై కూడా సొంత పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని ఈ తరహా ఆరోపణలు సొంత పార్టీచేశారు.
Nellore political news : వైఎస్ఆర్‌సీపీలో సొంత పార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారనేవారి సంఖ్య పెరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ తరహా ఆరోపణలు చేసి గంటలు గడవక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. తాను కూడా బాలినేని లాగే సొంత పార్టీ నేతల బాధితుడినేనని అన్నారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీని కొంతమంది ముఖ్యనేతలు నా నియోజకవర్గంలోకి వస్తున్నారని అన్నారు. నెల్లూరు రూరల్ లో తనను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా కూడా ప్రజల అండ, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసని అన్నారు. మీ సంగతి మీరు చూసుకోండి, మీ నియోజకవర్గం సంగతి మీరు పట్టించుకోండి అంటూ చురకలంటించారు .
సమయం వచ్చినప్పుడు పేర్లు బయటపెడతానన్న కోటంరెడ్డి !
తన ఇమేజ్ డ్యామేజీ చేయాలని, తనని బలహీన పరచాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని నిలువరించాలని తాను ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. అలాంటి వారు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, వారంతా సీజనల్ పొలిటీషియన్లేనని అన్నారు. అలాంటి సీజనల్ పొలిటీషియన్లకు తన నియోజకవర్గంతో ఏం పని అంటూ నిలదీశారు. వారి పేర్లు మాత్రం తాను ఇప్పుడు బయటపెట్టనని, ఇప్పటికే అధిష్టానానికి చెప్పానని, సమయం వచ్చినప్పుడు పేర్లు బయటపెడతానన్నారు.
రెండే ఆప్షన్లు పెట్టుకున్నా !
ఇప్పటికే అధిష్టానానికి వారిపై ఫిర్యాదు చేశానంటున్న రూరల్ ఎమ్మెల్యే.. సమస్య పరిష్కారం కాకపోతే.. తానే నేరుగా వారి నియోజకవర్గాల్లో వేలు పెడతానని హెచ్చరించారు. తాను వివాద రహితుడిని అని, తానెప్పుడూ ఎవరి జోలికీ వెళ్లలని, కానీ కావాలనే తన జోలికి వస్తే, తాను కూడా వారి నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ అది కాకపోతే చివరికి ఆ సమస్యను అధిష్టానానికే వదిలేస్తానన్నారు.
పార్టీ మారే ప్రసక్తే లేదన్న కోటంరెడ్డి !
మాజీ మంత్రి అనిల్ తో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అనిల్ తోనే కాదు, నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే కొంతమంది మాత్రం తన నియోజకవర్గం జోలికి వస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అలాంటి ప్రశ్న తనకు సంబంధించింది కాదని, తానెప్పటికీ వైసీపీలోనే ఉంటానన్నారు. సీజనల్ పొలిటీషియన్లలాగా తాను పార్టీలు మారనని చెప్పారు.