రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!
కోటంరెడ్డి బ్రదర్స్ ని గట్టిగా ఎదుర్కొని నిలబడేందుకు ఎవరైతే సరిపోతారా అనే విషయంలో అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు ఆదాలకు ఆ ప్లేస్ ఖరారు చేసింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అధిష్టానం ఎక్కకేలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ఆయన పేరు ఖరారు చేసింది. గత మూడు రోజులుగా ఇన్ చార్జ్ విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. కోటంరెడ్డి బ్రదర్స్ ని గట్టిగా ఎదుర్కొని నిలబడేందుకు ఎవరైతే సరిపోతారా అనే విషయంలో అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు ఆదాలకు ఆ ప్లేస్ ఖరారు చేసింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారు. దీంతో ఆయన కూడా ఆ సీటుపై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారే హిస్టరీ ఉన్న ఆదాలపై వైసీపీ ఎంతవరకు నమ్మకం పెట్టుకుంటుందో చూడాలి.
ఆదాలే ఎందుకు..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ చార్జ్ పదవి కోసం ఆనం విజయ్ కుమార రెడ్డి చివరి వరకూ ప్రయత్నించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తన అన్న ఆనం రామనారాయణ రెడ్డిని కూడా చెడామడా తిట్టారు. అన్నదమ్ములమే అయినా వైసీపీని కాదన్నందుకు రామనారాయణ రెడ్డిపై తనకు కోపం ఉందని, ఆయన అలాంటి పని చేసి ఉండాల్సింది కాదన్నారు. ఒకరకంగా తాను అన్న కంటే, జగనన్నకే విధేయుడిగా ఉంటానన్నారు. కానీ ఆయన్ను అధిష్టానం పరిగణలోకి తీసుకోలేకపోయింది. ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్నా.. సిటీలో ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు. దాదాపుగా కేడర్ అంతా కోటంరెడ్డితోనే బయటకు వెళ్లే పరిస్థితి. ఈ దశలో కాస్త క్యాష్ పార్టీ అయితేనే ఈ పదవికి బాగుంటుందని అధిష్టానం భావించిందని, అందుకే ఆదాలను రంగంలోకి దించిందని చెబుతున్నారు.
ఆదాల రూరల్ కి వస్తే.. ఎంపీ స్థానం ఎవరికి..?
ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ స్థానానికి వస్తే, మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే చర్చ కూడా ఇప్పుడే మొదలైంది. దానికోసం ఆల్రెడీ ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్కెచ్ వేశారు. ఆయన లేదా, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈదశలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని వ్యూహాత్మకంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ప్రకటించారు.
ఆదాల తలపడగలరా..
ప్రస్తుతం కోటంరెడ్డి బ్రదర్స్ నెల్లూరు రూరల్ లో బలంగా పాతుకుపోయారు. పార్టీ కేడర్ తో పాటు, తటస్థులు, సామాన్య ప్రజల్లో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డికి మంచి పేరుంది. ఆ పేరుతోనే వారు పార్టీ ఏదయినా, తమ గెలుపు ఖాయమనుకుంటున్నారు. అందుకే 15 నెలల అధికారం ఉండి కూడా పార్టీని వదులుకుని బయటకు వస్తున్నారు. కోటంరెడ్డి బ్రదర్స్ ని ఢీకొట్టాలంటే, కేడర్ ని తమవైపు తిప్పుకోవాలంటే.. అది ఆదాలకే సాధ్యమవుతుందని భావిస్తోంది అధిష్టానం. అందుకే ఆయన పేరు ఖరారు చేసింది.