wooden chariot preparations: అప్పుడు అగ్నికి ఆహుతైంది.. ఇప్పుడు కొత్త రథం రెడీ అవుతోంది..
ఏపీలో ఆలయాల ఘటనల్లో మొదటిది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో రథం దగ్ధమైన ఘటన. ఇప్పుడు ఈ క్షేత్రంలో కొత్త రథం నిర్మాణం పూర్తయింది. రథం నిర్మాణానికి రూ.85 లక్షలు, రథశాలకు రూ.25 లక్షలు కేటాయించింది ప్రభుత్వం.
సరిగ్గా రెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా కొండబిట్రగుండలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథం అగ్నికీలల్లో కాలిపోయింది. దీనికి కారణం మతి స్థిమితం లేని వ్యక్తి అని తేల్చారు. అయితే ఆ రథం దగ్ధమైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత రాష్ట్రంలో అంతర్వేది రథం కూడా అగ్నికి ఆహుతైంది. వరుసగా ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు వెలుగు చూశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో అప్పట్లో పెద్ద ఉద్యమమే నడిచింది. అయితే రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసింది. అయితే ఆ ఘటనల సమాహారంలో తొలి ఘటన నెల్లూరులో జరగడం గమనార్హం. అలా అగ్నికి ఆహుతైన ప్రసన్న వెంకటేశ్వరుడి రథం ఇప్పుడు దివ్యాంగ సుందరంగం రూపు దిద్దుకుంటోంది. నూతన రథం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త రథంపై వెంకటేశ్వరుడు నగరోత్సవానికి సిద్ధమవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో బిలకూట క్షేత్రంగా పేరున్న కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే 2020 ఫిబ్రవరి 14న ప్రసన్నుడి రథం అగ్నికి ఆహుతైంది. దీంతో అప్పట్లో రథోత్సవం జరగలేదు. ఆ తర్వాతి ఏడాది కూడా రథం రెడీ కాలేదు. కరోనా కారణంగా పనుల్లో జాప్యం అయింది. దీంతో పూల రథంతో ఉత్సవాలు నిర్వహించారు. ఇటీవల కొత్త రథం సిద్ధం చేస్తున్నారు. ఆరు చక్రాల ఈ రథం తుదు రూపు దిద్దుకుంటోంది.
రూ. 85 లక్షల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ రథం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రథం నిర్మాణానికి రూ.85 లక్షలు, రథశాలకు రూ.25 లక్షలు కేటాయించింది ప్రభుత్వం. అంతర్వేది రథం తయారు చేసిన శిల్పి గణపతాచార్యుల ఆధ్వర్యంలో పనులు చకచక సాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరు, గోదావరి జిల్లాలనుంచి నిపుణులైన కొయ్యపనివారిని తీసుకొచ్చి రథం తయారు చేయిస్తున్నారు. ఆరు చక్రాల రథం అంతస్తుల వారీగా విభజించి ఉంటుంది. హిందుస్తాన్ షిప్ యార్డ్ వారి సహకారంతో హైడ్రాలిక్ మిషన్లు కూడా ఇక్కడ అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చక్రాలను కూడా చక్కతో తయారు చేసి, వాటిలో ఇనుప కమ్మీలను అమర్చారు. రథంపై దేవతా మూర్తుల బొమ్మలను చెక్కించారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా రథం నిర్మాణం సాగుతోంది.
ఏపీలో ఆలయాల ఘటనల్లో మొదటిది నెల్లూరు జిల్లా బిట్రగుంటలోని రథం దగ్ధమైన ఘటన. ఇప్పుడు ఈ క్షేత్రంలో కొత్త రథం నిర్మాణం పూర్తయింది. ఆలయ నిర్మాణం తర్వాత ఇది మూడో రథంగా చెబుతున్నారు స్థానికులు. గతంలో తొలి రథం శిథిలమవ్వగా, రెండో రథం అగ్నికి ఆహుతైంది. మూడో రథం ఇప్పుడు సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. త్వరలో రథం ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. సీఎం జగన్ చేతుల మీదుగా రథాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. వర్చువల్ విధానంలో అయినా సరే సీఎం చేతుల మీదుగా రథాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.