Nellore News: నెల్లూరులో వెంకటేశ్వర వైభవోత్సవాలకు ఏర్పాట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నెల్లూరు నగరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 14 నుంచి 20వ తేదీ వరకు వైభవోత్సవాలు జరుగుతాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నెల్లూరు నగరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 14 నుంచి 20వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు, పార్కింగ్, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేపడతామని తెలిపారు అధికారులు. ఉత్సవం జరిగే ప్రాంతంలో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు అధికారులు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ తరపున టీటీడీ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారికి జరిగే నిత్యసేవలు ఇక్కడ నిర్వహిస్తారు. జిల్లా ప్రజలు ఈ సేవలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్లు, బారికేడ్లు పెట్టి, మంచినీటి వసతి తో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వెంకటేశ్వర వైభవోత్సవాల షెడ్యూల్
ఆగస్ట్ 14, 15 తేదీల్లో ఉత్సవ విశేషాలను భక్తులకు తెలుపుతూ ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయన్నారు. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, టీటీడీ ఆస్థాన పండితులు ఈ ప్రసంగాలు చేస్తారు.
ఆగస్ట్ 16నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం శ్రీవారికి తొలి సేవ సుప్రభాతంతో మొదలై చివరగా ఏకాంత సేవతో ముగుస్తుంది.
ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం ఊరేగింపు నిర్వహిస్తారు.
ఆగస్ట్ 16వ తేదీ అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం
17వ తేదీన సహస్ర కలశాభిషేకం
18వ తేదీన తిరుప్పావడ నివేదన
19వ తేదీన అభిషేకం
20వ తేదీన పుష్పయాగం, శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తారు.
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుమలలో శ్రీవారికి పండితులు ఏ విధంగా క్రతువులు నిర్వహిస్తారో అదే రీతిలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని నమూనా ఆలయ ప్రాంగణంలో అన్ని ప్రామాణికాలు పాటిస్తూ ఆయా క్రతువులు నిర్వహిస్తారు. ఆగస్టు 20న శ్రీవారి కల్యాణం సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొనే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.
ఈమేరకు ఉత్సవ ఏర్పాట్లకోసం చేపట్టిన సమీక్ష సమావేశంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, నెల్లూరు నగర కమిషనర్ జాహ్నవి, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి, ఆర్డీఓ కొండయ్య, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ హరినాథ్ రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య.. తదితరులు పాల్గొన్నారు.