రెండు రోజుల్లో రెండు హత్యలు-నెల్లూరు నగరంలో భయం భయం
వరుసగా రెండు రోజులు నెల్లూరు నగరంలో రెండు హత్యలు జరిగాయి. ఒకటి రాజకీయ ప్రతీకార హత్యగా అనుమానిస్తున్నారు. మరో హత్యలో అసలు హతుడు ఎవరో కూడా గుర్తు పట్టలేని పరిస్థితి.
వరుసగా రెండు రోజులు నెల్లూరు నగరంలో రెండు హత్యలు జరిగాయి. ఒకటి రాజకీయ ప్రతీకార హత్యగా అనుమానిస్తున్నారు. మరో హత్యలో అసలు హతుడు ఎవరో కూడా గుర్తు పట్టలేని పరిస్థితి. రెండు రోజుల్లో రెండు హత్యలు జరిగినా ఇప్పటి వరకూ హంతకుల గురించి ఆచూకీ లభించలేదు. త్వరలో హంతకుల్ని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
సినిమా స్టైల్లో దాడి, హత్య..
నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారి అది. అర్ధరాత్రి, జోరు వర్షం కావడంతో నిర్మానుష్యంగా ఉంది. అదే సమయంలో ఓ ఆటో వెళ్తోంది. ఆ ఆటోను కొంతమంది బైకుల్లో ఫాలో అయ్యారు. చివరకు మనుషులెవరూ లేని చోట ఆటోకు బైకులు అడ్డం పెట్టి ఆపేశారు. ఆటోలనుంచి గిరీష్ కుమార్ అనే వ్యక్తిని బయటకు లాగారు. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి, ఆటో డ్రైవర్ అక్కడినుంచి పారిపోయారు. వారు పారిపోయిన తర్వాత గిరీష్ కుమార్ ను దారుణంగా నరికి చంపేశారు. అతని శవం పూర్తిగా రక్తంతో నిండిపోయింది. జోరు వానలో కూడా రక్తపు మరకలు రోడ్డుపై నుంచి తొలగలేదు అంటే ఎంత రక్తస్రావం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నెల్లూరు నగరం ఫతేఖాన్ పేటకు చెందిన అందె గిరీష్ కుమార్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతనిపై 2014 నుంచి 2019 వరకు వివిధ కేసులు నమోదయ్యాయి. సూళ్లూరుపేట, నెల్లూరు వేదాయపాళెం, చిన్నబజారు, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. హత్య, హత్యాయత్నం కేసులు కూడా అతడిపై నమోదయ్యాయి. నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో గిరీష్ పై రౌడీషీట్ కూడా తెరిచారు.
ఓ పార్టీతో అనుబంధం..
గిరీష్ కి ఓ రాజకీయ పార్టీతో అనుబంధం ఉందని తెలుస్తోంది. కీలక నాయకుడితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆ పార్టీకి చెందిన వ్యక్తిపై దాడి జరిగింది. ఆ దాడికి ఈ హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్య జరిగిన సమయంలో హతుడితోపాటు ఉన్న స్నేహితుడి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
ఇక ఆ మరుసటి రోజే నెల్లూరులో మరో శవం బయటపడటం మరింత సంచలనంగా మారింది. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు లోని గౌతమ్ నగర్, రామచంద్ర మిషన్ వద్ద గోనె సంచిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ శవం ఎవరిదనే విషయంపై ఇప్పటి వరకూ పోలీసులకు ఆధారాలు లబించలేదు. స్థానిక పోలీసులు శవం ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నారు. హతుడు ఎవరో తెలిస్తే, అసలు హత్య ఎందుకు చేశారనే కోణంలో విచారణ మొదలు పెట్టే అవకాశముంది. అయితే రెండో కేసులో హతుడు కూడా ఎవరో తెలియకపోవడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు.
పోలీసుల నిఘా ఏమైంది..
నగరంలో వరుస హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే అనుమానాలొస్తున్నాయి. ఇటీవల బీట్ డ్యూటీలు మెరుగుపరిచామని కూడా పోలీసులు చెబుతున్నా వరుస హత్యలు జరిగే సమయంలో బీట్ డ్యూటీల్లో పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరనే విషయం తేలాల్సి ఉంది.