నెల్లూరులో వారం రోజులపాటు సెక్యూరిటీ టైట్
మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు.
ఈనెల 9వతేదీ నుంచి 13వరకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం, రొట్టెల పండగ జరగబోతున్నాయి. దాదాపుగా వారం ముందు నుంచే యాత్రికులు నెల్లూరుకు వస్తుంటారు. రొట్టెల పండగ జరిగిన మరో రెండు మూడు రోజుల వరకు భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు నెల్లూరులో సెక్యూరిటీని పూర్తిగా టైట్ చేసేందుకు నిర్ణయించారు అధికారులు. నెల్లూరు నగరంలో వాహనాల రద్దీ నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ విజయరావు రొట్టెల పండగ సెక్యూరిటీ విషయంలో సమీక్ష నిర్వహించారు. దర్గా నిర్వాహకులు, రొట్టెల పండగ కమిటీ సభ్యులతో చర్చించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు నిర్ణయించారు.
మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. రొట్టెల పండుగకు విచ్చేసిన భక్తులు దర్గాలోకి ప్రవేశించడం, ఆ తర్వాత బయటకు వచ్చి, స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవడం నుంచి తిరిగి క్షేమంగా ఆ ప్రాంగణం దాటి వెళ్లేంత వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా పరిశీలించి, తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు ఎస్పీ విజయరావు.
అడుగడుగునా బారికేడ్లు..
దర్గా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్, మెయిన్ దర్గా, ఘాట్ ఏరియా, బోట్ షికార్, స్నాననపు గదులు, రొట్టెలు మార్చుకునే ప్రదేశాలను ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ విజయరావు.
పార్కింగ్ ఇలా..
నెల్లూరు నగరంలోకి వచ్చే భక్తులు వాహనాలను దర్గా ప్రాంగణంలో పార్కింగ్ చేసే అవకాశం లేదు. అందుకే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. VRC గ్రౌండ్, YMC గ్రౌండ్, KVR పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయ స్థలం, కస్తూరిబా స్కూల్, సైన్స్ పార్క్ ప్రాంతం, GGH బాయ్స్ హాస్టల్, ZP గర్ల్స్ హైస్కూల్, అల్ ఇండియా రేడియో స్టేషన్, ZP ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణం, TB హాస్పిటల్, ST జోసెప్ స్కూల్, ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలాలను పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాలని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎస్పీ విజయరావు. ఆయా ప్రాంతాలన్నిటినీ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.
వక్ఫ్ బోర్డ్ సిబ్బంది సహకారంతో..
వక్ఫ్ బోర్డ్ సిబ్బంది సహకారంతో రొట్టెల పండగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎస్పీ. గత రెండేళ్లుగా కరోనా కారణంగా రొట్టెల పండగ నిర్వహించలేదు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు కూడా ఈ రొట్టెల పండగకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మరింత పగడ్బందీగా ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటికే అధికారులకూ సూచనలు ఇచ్చారు జిల్లా ఎస్పీ విజయరావు.