కోటీ 75 లక్షల రూపాయల దొంగతనం కేసులో నెల్లూరు పోలీసులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఖాకీలు
తెలంగాణ పోలీసులనుంచి నెల్లూరు పోలీసులకు ఫోన్ వచ్చింది. భీమవరంలో నిందితుల్ని తాము అరెస్ట్ చేశామని, ఈ కేసులో తెలంగాణ పోలీస్ అధికారిణి కుటుంబం బాధితులు కావడంతో సొమ్ము రికవరీ చేస్తున్నామని చెప్పారు.
కోటీ 75 లక్షల రూపాయల భారీ దొంగతనం అది. ఆ కేసుని నెల్లూరు జిల్లా పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపుగా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. దొంగలు దొరికిపోతారనుకున్న టైమ్ లో సడన్ గా నెల్లూరు జిల్లా స్పెషల్ టీమ్ కి తెలంగాణ పోలీసులనుంచి ఫోన్ వచ్చింది. దొంగల్ని ఆల్రడీ తాము అదుపులోకి తీసుకున్నామని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సమాచారమిచ్చారు తెలంగాణ పోలీసులు. దీంతో నెల్లూరు పోలీసులు షాకయ్యారు. తాము అదుపులోకి తీసుకోవాలనుకున్న దొంగల్ని తెలంగాణ పోలీసులు క్యాచ్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు సమాచారమంతా వారికి ఎలా తెలిసిందని అనుకుంటున్నారు. ఈ ఘటనపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
నెల్లూరు నగరం మిలిట్రీ కాలనీలో మైన్స్ డిపార్ట్ మెంట్ కి చెందిన రిటైర్డ్ జాయింట్ డెరెక్టర్ ఇల్లు ఉంది. ఆ కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్ లో స్థిరపడగా ఇక్కడ ఇంటికి నిత్యం తాళం వేసి ఉండేవారు. అయితే ఈ ఇంటిలో కూడా విలువైన వస్తువులు ఉన్నాయి. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వెళ్తుండేవారు. ఈ నేపథ్యంలో పక్కాగా రెక్కీ చేసి ఆ ఇంటిలో గత నెలలో దొంగతనం చేశారు దుండగులు. కోటీ 75 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు పోయిందని ఫిర్యాదు అందింది. భారీ దొంగతనం కావడంతో పోలీసులు కూడా ఈ కేసుపై సీరియస్ గా దృష్టి పెట్టారు.
ఫిబ్రవరి 12వతేదీ అర్థరాత్రి ఇంటి తాళం పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్గామిట్ట పోలీసులతోపాటు సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణ చేపట్టారు. సదరు బాధిత కుటుంబానికి చెందిన మహిళ తెలంగాణలో పోలీస్ అధికారి కావడంతో తెలంగాణ పోలీసులు కూడా దీనిపై విచారణ చేపట్టారు. సొమ్ము రికవరీకోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇటు నెల్లూరు పోలీసులు, అటు తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులకే చెందిన ఇంట్లో దొంగతనం కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ దశలో నెల్లూరు పోలీసులు చాలా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీ సాయంతో దాదాపుగా కేసు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. కొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు. వారు చెప్పిన సమాచారం ప్రకారం.. భీమవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు పాత నేరస్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నెలరోజుల్లో దొంగలను గుర్తించారు. దొంగతనం తర్వాత పారిపోయిన ఆ ముఠా సభ్యులు.. నెలరోజుల తర్వాత ఇక పోలీసులు ఈ కేసుని పక్కనపెట్టారని భావించి తిరిగి భీమవరం వచ్చారు. భీమవరంలోనే వారు మకాం వేశారని తెలుసుకున్న నెల్లూరు పోలీసులు వారిని పట్టుకోడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ పోలీసులనుంచి ఫోన్ వచ్చింది. భీమవరంలో నిందితుల్ని తాము అరెస్ట్ చేశామని, ఈ కేసులో తెలంగాణ పోలీస్ అధికారిణి కుటుంబం బాధితులు కావడంతో సొమ్ము రికవరీ చేస్తున్నామంటూ నెల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నెల్లూరు పోలీసులు అవాక్కయ్యారు. విచారణ అంతా పూర్తి చేసి, చివరకు వారిని పట్టుకునే క్రమంలో దొంగలు తెలంగాణ పోలీసులకు చిక్కడం విశేషం. సీసీఎస్ లో ఓ అధికారి సమాచారం తెలంగాణ పోలీసులకు చేరవేశారనే అనుమానాలుండటంతో.. ఆ దిశగా ఇంటర్నల్ ఎంక్వయిరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.