YS Jagan Tour: వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత- టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
YS Jagan Tour: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని పొదిలిలో జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

YS Jagan Tour: వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ పర్యటన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను కించపరిచేలా నాయకులను ప్రోత్సహించిస్తున్న జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కొందరు నేతలు ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని, నల్లబెలూన్‌లతో నిరసన తెలియజేశారు. గోబ్యాక్ జగన్ మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.
జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అటు నుంచి అదే స్థాయిలో రిప్లై వచ్చింది. ఇలా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది.
నీ డైవర్షన్ నాటకాలు ఆపు జగన్.. నువ్వు ఏపిలో ఏ మూలకి వెళ్ళినా మహిళలు నిన్ను వదిలి పెట్టరు. నువ్వు చేయిస్తున్న నీచమైన పనులకు క్షమాపణ చెప్పాల్సిందే. #YCPinsultsWomen
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 🛕🇮🇳 (@Shiva4TDP) June 11, 2025
pic.twitter.com/caSIwcaUCU
పొదిలిలో పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. రెండు పార్టీలు విసిరిసిన రాళ్లు, చెప్పులు పోలీసులపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు అయ్యాయి. వారందర్నీ సహచరులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
శాంతియుతంగా నిరసన తెలియజేసే మహిళలపై దాడులు చేయించడం ఏంటని జగన్ మోహన్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పొదిలిలో జరిగిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. రౌడీలను గౌరవించినంతా మహిళలను గౌరవించడం జగన్ మోహన్ రెడ్డికి రాదని ఎద్దేవా చేశారు. "పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే. మహిళలపై వైకాపా నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైకాపా చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.
#YCPinsultsWomen#YCPattacksWomen #PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి గారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్… pic.twitter.com/yYCcBnvXsN
ఈ పర్యటనలో మాట్లాడిన జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రైతు సమస్యలపై స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అన్నారు. మరోవైపు లోకేష్ స్పందించిన తీరుపై వైసీపీ మండిపడింది. జగన్ టూర్‌కు ఎక్కువమంది జనాలు వచ్చారనే ఆక్రోశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని " లోకేష్ నీ ఆక్రోశం, ఏడుపు ఎందుకో ప్రజలకు అర్థమైంది. ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల పరామర్శకు జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే ప్రజలు ఒక ప్రవాహంలా కదిలి వచ్చారు. ఆ దృశ్యాలను చూసిన తర్వాత నీకు స్వతహాగానే కడుపుమంట వస్తుంది. మీ దుర్మార్గపు పాలనపై ప్రజలు ఇచ్చిన సంకేతం అది. అందుకే జగన్ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి, కొంతమంది మహిళలను పోగుచేసి, నిరసన అనే ముసుగు తొడిగి వారితోనూ, వారి వెనక నుంచి నీ కార్యకర్తలతోనూ దాడులు చేయించి, హింసను రాజేసే పథకం వేశావు. కాని ప్రజలు నీ కుట్రలను గమనించి సంయమనంతో వ్యవహరించారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నీ తండ్రికి, నీకు అలవాటే. ఎన్టీఆర్‌ని దించడానికి ఏకంగా ఆయన సతీమణిపైనే తప్పుడు ప్రచారం చేసి వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. మీ కుట్రలు, మీ వేషాలు ప్రజలకు తెలియనివి కావు."అని విమర్శలు చేస్తూ వైసీపీ సోషల్ మీడియా హ్యండిల్‌లో పోస్టు పెట్టారు.





















