మంత్రులు కాదు, జోకర్లు- సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి యాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతి చలించిందని మండిపడ్డారు సోమిరెడ్డి. ఆనాడు అందరు నేతలు అమరావతికి మద్దతిచ్చారని, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.
రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు హైకోర్టు నుంచి తిరుమలకు యాత్ర చేపట్టారు. అయితే ఆ యాత్ర మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది. ఆ క్రమంలో యాత్ర విజయవంతం అయిందంటూ రైతులు ఉత్సాహంగా వెెళ్లారు. ఇప్పుడు మరోసారి రైతులు అమరావతి టు అరసవెల్లి యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరక ముందే గొడవలు మొదలవుతున్నాయి. యాత్ర చేస్తున్న వారిని తరిమి కొట్టాలంటూ వైసీపీ నేతలు ఇస్తున్న పిలుపులు కలకలం సృష్టిస్తున్నాయి.
అమరావతి యాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతి చలించిందని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనాడు జగన్ సహా అందరు నేతలు అమరావతికి మద్దతిచ్చారని, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు సోమిరెడ్డి. మంత్రులంతా జోకర్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారాయన. రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి, పరిశ్రమల్ని తరిమి కొడుతున్నారని మండిపడ్డారు సోమిరెడ్డి.
సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు సోమిరెడ్డి. అమరావతిలో రాజధాని కడతామంటేనే రైతులు భూములిచ్చారని, అలాంటి వారిని అవమానిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి అధికార, ప్రతిపక్షలుండే నిండు సభలో ఒప్పుకుంటేనే రైతులు భూములివ్వడానికి అంగీకరించారని గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని కడతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లలో గెలిచిందని అన్నారు. అప్పుడు అమరావతికి జై అన్న నేతలే ఇప్పుడు నై అనడం సరికాదన్నారు.
కరణం ధర్మశ్రీ ఒక్కరే రాజీనామా చేస్తే సరిపోదని, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పయాంలో విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. దమ్ముంటే 30 మందికిపైగా ఉన్న లోక్‌సభ, రాజ్యసభ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖలో రైల్వే జోన్ తీసుకురండి అని సవాల్ విసిరారు. మూడు రాజధానులు ఉన్న సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చూసి, ఏపీ గురించి మాట్లాడాలని హితబోధ చేశారు. రైతుల పాదయాత్ర పై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని చెప్పారు సోమిరెడ్డి.
కుప్పంలో కట్టారా ఏంటి..?
కుప్పంలోనో, నారావారిపల్లిలోనో చంద్రబాబు రాజధాని పెట్టుకుంటే వైసీపీ నేతలు ఏడవాలని, కానీ ఆయన రాజధాని అమరావతిని రాష్ట్ర నడిబొడ్డులో నిర్మించాలనుకున్నారని, దానికి వైసీపీ నేతలకు వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు. అమరావతికి అభివృద్ధికి సంబంధం లేదని, అమెరికాలోని పరిస్థితులే అందుకు నిదర్శనం అని చెప్పారు సోమిరెడ్డి. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన 10 కేంద్ర సంస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విశాఖలో భూకుంభకోణంలో 40 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలు అన్నట్టుగా పాలన జరుగుతోందని మండిపడ్డారు. మంత్రులు రాజీనామా చేసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలని సూచించారు.