Nellore News:నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం- ఇంట్లోకి దూసుకెళ్లిన కారు- ఆరుగురు మృతి
Nellore News:నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం ఆరుగురు ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లి ఐదుగురు మెడికోలు మృతి చెందారు.

Nellore News: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నడిపిన వారంతా నారాయణ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్.
నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఫ్రెండ్ నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ముంబయి హైవేపై ఉన్న పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పింది. వెంటనే హోటల్ నిర్వహిస్తున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి ఎంగేజ్‌మెంట్‌కు కారులో వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన అభిషేక్‌రాజ్, నరేష్ నాయక్, నెల్లూరు జిల్లాకు చెందిన జీవన్ చంద్రారెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన యజ్ఞేష్, తిరుపతికి చెందిన పురుషోత్తం చనిపోయిన వారిలో ఉన్నారు. కడపకు చెందిన నవనీత్ శంకర్ అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీళ్లంతా నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వైద్య విద్యార్థులు అభిషేక్, జీవన్, నరేష్, యజ్ఞేష్, అభిసాయి మృతి చెందారు. హోటల్‌లో ఉన్న వెంకటరమణయ్య కూడా చనిపోయారరు. ఇది చాలా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదే జిల్లాలో ఈ మధ్య ఓ ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం హైవేపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అందులో కూడా ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా, విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ బైక్‌పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. మన్సూర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్‌కుమార్‌కు ఇంకా పెళ్లి కావాల్సి ఉంది.
పైన రెండు ప్రమాదాల్లో కూడా స్నేహితులే మృతి చెందారు. అతి వేగంతో ఉన్నందునే రెండు దుర్ఘటనలు కూడా జరిగాయని పోలీసులు చెబుతున్నారు.





















