Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై ఐదు కిలోమీటర్లు. సామాన్యులే నడవడం కష్టం. అలాంది ఓ గర్భిణీ నడిచిందంటే నిజంగా షాకింగ్. వస్తూ వస్తూనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
![Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ Pregnant Lady Marathon Walk In Andhra Pradesh Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/7bb2c599b1c3e76da44216e7c6b9b023_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాయుడుపేటలో 108 సిబ్బంది ఓ గర్భిణికి ప్రసవం చేశారు. అయితే ఆమె చెప్పిన మాటలు విని విస్తుపోయారు. నిండు గర్భిణిగా ఉన్న ఆ మహిళ 65 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చానని చెప్పే సరికి షాకయ్యారు. రెండు రోజులుగా ఆమె తిండీ తిప్పలకు దూరమైంది. ఒంట్లో సత్తువ లేదు, పుట్టినబిడ్డ బరువు తక్కువగా ఉండటంతో వెంటనే నెల్లూరు ఆస్పత్రికి పంపించారు.
ఆమె పేరు వర్షిణి. ఊరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ నగర్. ఉన్న ఊరిలో ఉపాధి లేక భర్తతో కలసి తిరుపతి వచ్చింది. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు భార్యా భర్త. వర్షిణి గర్భంతో ఉన్నా కూడా పనులకు వెళ్లేది. అయితే భర్తతో రోజూ గొడవలే. భర్త మాట వినకపోయే సరికి ఆమె విసుగు చెందింది. భర్తపై కోపంతో ఒంటరిగా సొంత ఊరు వెళ్లేందుకు బయలుదేరింది.
సొంతూరు బయల్దేరిన ఆ మహిళకు బస్సు ఎక్కాలన్న ఆలోచన రాలేదు. వేరే వాహనంలో అయినా రావాలనుకోకపోవడం విచిత్రం. కాలినడకన తిరుపతి నుంచి నాయుడుపేట వరకు వచ్చింది. అక్కడికి వచ్చేసరికి ఆమెకు ఇక కాలు ముందుకు పడలేదు. నాయుడుపేటలో ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆగింది. అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రసవ సమయం దగ్గరపడిందని అర్థమైంది.
సాయం చేసేవారు లేక అక్కడే కూలబడిపోయిన వర్షిణి దీన స్థితి చూసి ఓ వ్యక్తి 108కి ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. 108 సిబ్బంది అక్కడకు వచ్చి వర్షిణి పరిస్థితి చూసి చలించిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోవడంతో బిడ్డ కిందకు జారిపోతున్నట్టు అనిపించడంతో వెంటనే ప్రసవం చేశారు. 108లోనే ప్రసవం కాగా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది వర్షిణి.
అక్కడితో మరో సమస్య మొదలైంది. బిడ్డ బరువు తక్కువగా ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఆమెకు ఎవరూ లేరు, ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. రెండు రోజులుగా తిండి లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను నేరుగా నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.
ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న వర్షిణి తన వివరాలు చెప్పేందుకు కూడ నిరాకరిస్తోంది. తల్లిదండ్రుల వివరాలు ఆమె చెప్పలేదు. కేవలం భర్తతో గొడవపడి ఆయన మీదా కోపంతో తాను ఇల్లు వదిలి వచ్చేశానంటోంది. తమది తూర్పుగోదావరి జిల్లా అని మాత్రమే చెబుతోంది.
వర్షిణి పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో దిశ పోలీసులు ఆమె వివరాలు సేకరిస్తున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించి సొంత ఊరికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిండు చూలాలు ఏకంగా 65 కిలోమీటర్లు కాలినడకన వచ్చిందంంటేనే అందరూ ఆశ్యర్యపోతున్నారు. కనీసం దారిలో ఎవరూ ఆమె కష్టాలు పట్టించుకోలేదా, కడుపులో బిడ్డ ఉన్నా కూడా ఆమె ఎక్కడా ఏ వాహనం ఎందుకు ఎక్కలేదు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)