By: ABP Desam | Updated at : 23 Jun 2022 05:50 PM (IST)
ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నికల పోలింగ్- తగ్గిన పోలింగ్ పర్సంటేజీ
ఊహించినట్టుగానే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గతంకంటే పోలింగ్ పర్సంటేజీ తగ్గింది. అయితే ముందే ఊహించినట్టు మరీ తక్కువగా నమోదు కాకపోవడం, మధ్యాహ్నం ఒక్కసారిగా పోల్ పర్సంటేజీ పెరగడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం. అయితే అధికార వైసీపీ అంచనా వేసినట్టు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
గెలుపుపై ధీమా..
అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలవగా, ప్రతిపక్ష అభ్యర్థిగా బీజేపీ తరపున భరత్ కుమార్ ఇక్కడ పోటీకి నిలిచారు. జనసేన, టీడీపీ పోటీలో లేవు. అయితే ఆ రెండు పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరులు ఎవరికి మద్దతిచ్చారో తేలాల్సి ఉంది. పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇరు పార్టీల నేతలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
గతంలో ఇలా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి 22,276 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై గెలిచారు. ఆ ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి 53.22 శాతం ఓట్లు.. అంటే 92,758 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యకు 70,482 ఓట్లు వచ్చాయి. 2014 కంటే 2019లో టీడీపీ కాస్త ఓట్ల శాతం మెరుగుపరచుకుంది. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆపార్టీ పోలింగ్ కి దూరంగా ఉంది.
ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయి. గతరాత్రి భారీ వర్షం పడటంతో.. కొన్ని చోట్ల వాననీటితో ఓటర్లు అవస్థలు పడ్డారు. వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ సజావుగా మొదలైంది. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల కారణంగా చాలామది భక్తులు.. అమ్మవారి ఆలయానికి వెళ్లారు. పోలింగ్ శాతంపై దీని ప్రభావం కనిపించింది. ఉదయాన్నే కొన్ని చోట్ల ఓటర్లు బారులు తీరారు, మరికొన్ని చోట్ల మధ్యాహ్నానికి పోలింగ్ శాతం బాగా పెరిగింది. మొత్తమ్మీద.. చివరిదాకా పరిస్థితి అంచనా వేస్తే.. గతం కంటే పోలింగ్ శాతం తగ్గింది.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు బీజేపీ తరపున కూడా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రచారానికి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేదు కాబట్టి.. హోరా హోరీగా పోరు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. చివరగా పోలింగ్ రోజు ఒకటి రెండు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్నా పోలీసులు సర్దుబాటు చేశారు. బీజేపీ అభ్యర్థికి, వైసీపీ నేతలతో వాగ్వాదం నెలకొంది. బట్టేపాడు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
డీసీ పల్లిలోని ఓ పోలింగ్ బూత్ లోకి బీఎల్వో అయిన సచివాలయ ఉద్యోగి వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పోలింగ్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగారు. సచివాలయ ఉద్యోగి బీఎల్వో అయినా పోలింగ్ బూత్ లోకి వెళ్లకూడదని అన్నారాయన. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెదురుమదురు సంఘటనలు మినహా.. మొత్తమ్మీద ఆత్మకూరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా
APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?