Subbareddy vs Balineni: ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి హడావిడి, బాలినేనికి చెక్ పెట్టేందుకేనా?
వైవీ సుబ్బారెడ్డి మళ్లీ ఒంగోలుకి వస్తే బాలినేని హవా తగ్గినట్టే చెప్పుకోవాలి. అందుకే ఆయన మాగుంట ఫ్యామిలీకి దగ్గరయ్యారు. గతంలో బాలినేని, మాగుంట మధ్య అంత సఖ్యత లేకపోయినా.. ఇప్పుడు వారిద్దరూ ఒకటయ్యారు.
Subbareddy vs Balineni:
ఆమధ్య బాలినేని శ్రీనివాసులరెడ్డి అలకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆ తర్వాత ఆయన ఇంచార్జ్ పదవులనుంచి తప్పుకొని ఒంగోలు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. మళ్లీ ఇటీవల వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీతో ఒంగోలు రాజకీయం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ గా ఇన్నాళ్లూ ఆ బాధ్యతల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఒంగోలుకి దూరమయ్యారు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన ఆయన 2019లో ఆ సీటు మాగుంట ఫ్యామిలీకి త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి వరించింది. ఆ పదవీకాలం పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై వైవీ దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. మళ్లీ ఆయన ఒంగోలుకే వచ్చారు, ఒంగోలులో పాత వర్గాన్ని ఒకచోటకు చేరుస్తున్నారు.
టీటీడీ చైర్మన్ హోదాలో ప్రకాశం జిల్లాకు వచ్చినా ఒకటీ అరా వ్యక్తిగత పర్యటనలు తప్ప రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు వైవీ. ఇప్పుడు ఒంగోలుపై ఆయన దృష్టి పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన పాత వర్గాన్ని చేరదీస్తున్నారు. ఒంగోలులోని గోపాలనగర్ లోని శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 18 కిలోల వెండి తొడుగును స్వామివారికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంపీ మాజీ ఛైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆయన బాలినేనితో ఇటీవల విభేదించారు. ఇప్పుడు వైవీ ఆయన్ను చేరదీశారు. అంటే బాలినేనికి పోటీగా వైవీ తన వర్గాన్ని ఒకేచోటకు చేరుస్తున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది.
ఎంపీ స్థానం కోసం వైవీ..
ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తిరిగి పోటీ చేయాలనేది వైవీ ఆలోచన. అందుకే ఆయన ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల తరచూ ఒంగోలుకి వస్తున్నారు. పైగా ఆయన్ను ఢిల్లీ వ్యవహారాలకోసం జగన్, పార్టీలో బిజీ అయ్యేలా చేస్తున్నారు. అంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన లోక్ సభకు పోటీ చేస్తారనేది మాత్రం గ్యారెంటీ, అయితే ఆ సీటు ఒంగోలా కాదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
మాగుంట సంగతేంటి..?
వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ ఇస్తే, సిట్టింగ్ ఎంపీ మాగుంట పరిస్థితి ఏంటనేది తేలడంలేదు. మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై బెయిలుపై బయటకొచ్చారు. ఆయన అరెస్ట్ తర్వాత మాగుంట ఫ్యామిలీని వైసీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదనే అపవాదు ఉంది. ఆ కోపం మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా ఉంది. మరోసారి ఒంగోలు సీటు ఇస్తే మాగుంట ఫ్యామిలీ వైసీపీలోనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒంగోలునుంచైనా, లేదా నెల్లూరు నుంచయినా మాగుంట ఫ్యామిలీ టీడీపీ తరపున బరిలో నిలిచే అవకాశముంది.
బాలినేని కష్టాలు..
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఓ దశలో సొంత పార్టీ నేతలే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బాలినేని ప్రెస్ మీట్ లోనే భావోద్వేగానికి గురైన పరిస్థితులున్నాయి. అలాంటిది ఇప్పుడు వైవీ మళ్లీ ఒంగోలుకి వస్తే బాలినేని హవా తగ్గినట్టే చెప్పుకోవాలి. అందుకే ఆయన మాగుంట ఫ్యామిలీకి దగ్గరయ్యారు. గతంలో బాలినేని, మాగుంట మధ్య అంత సఖ్యత లేకపోయినా.. ఇప్పుడు వారిద్దరూ ఒకటయ్యారు. ఒక్కటిగా వైవీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు. కానీ వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన దూకుడుమీదున్నారు. ఒంగోలులో బాలినేని హవా తగ్గించాలనుకుంటున్నారు.