మరోసారి బాలినేని అలక- విజయసాయిరెడ్డిపై ఆగ్రహం !
Ongole Today News: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
Balineni Srinivas Reddy News: ఒంగోలు: మాజీ మంత్రి, వైసీపీ (YSRCP) సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. కనిగిరి(Kanigir) బస్సుయాత్రకు రానని, మీ పని మీరు చూసుకుంటే, ఒంగోలులో తన పనేదో తాను చేసుకుంటానని విజయసాయిరెడ్డి (Vijay sai Reddy)కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు. మార్కాపురంలో వైసీపీ సాధికార బస్సు యాత్రకు ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పోటీచేస్తారని, ఆయన్ను గెలిపించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రోజంతా కలిసే ఉన్నా తమకు చెప్పకుండా ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇతర నేతలు చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత కనిగిరి సభకు వెళ్లేముందు ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులో ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని, ఇప్పుడు ఏమీ చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత నెలలో గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. కొంతకాలంగా ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు దోషుల తెలిసినా కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న బాలినేని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని, అరెస్ట్ చేసి తీరాల్సిందేనన్నారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానన్న బాలినేని, పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తక్షణం, తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, సీఎం జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.