సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు.
నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని ఇటీవల మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఇదే నెలలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ బ్యారేజి ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కూడా పలుమార్లు చాలామంది నేతలు ఇలాగే హామీలిచ్చారు. కానీ ఈసారి పరిస్థితి చూస్తుంటే.. పనులు పూర్తికావొచ్చాయి కాబట్టి మంత్రి మాట నమ్మేట్టుగా ఉంది. అయితే బ్యారేజ్ పూర్తయ్యేనాటికి రాజకీయ వివాదాలకు ఇది కేంద్రబిందువుగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. సంగం బ్యారేజీ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. కానీ ఆ బ్యారేజీ వల్ల సాగునీరు కావలి, కోవూరు నియోజకవర్గాల వారికి ఉపయోగంగా ఉంటుంది. దీంతో ఈ బ్యారేజి విషయంలో ఎమ్మెల్యేలు పంతాలు, పట్టింపులకు పోతున్నట్టు తెలుస్తోంది. నీటి విడుదల, పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సంగం సెక్షన్ ను సెంట్రల్ డివిజన్ పర్యవేక్షణలో ఉంచే ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తమ నియోజకవర్గంలో జరిగే పనులపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటంలేదని, మరొక నియోజకవర్గంలోని డీఈ, ఈఈలు ఈ పనుల్ని పర్యవేక్షిస్తుండటంతో తమకు కనీస సమాచారం కూడా రావడంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయన సోదరుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి పేరు మీదుగా ఈ బ్యారేజ్ నిర్మిస్తుండటంతో.. దీని నిర్మాణంపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మరొక నియోజకవర్గానికి చెందిన డీఈ, ఈఈలు సకాలంలో సమాచారం ఇవ్వడంలేదనేది ఇక్కడ ప్రధాన అభియోగం.
దీంతో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అభ్యర్థన మేరకు.. సంగం బ్యారేజ్ పనుల బాధ్యతను ఆత్మకూరు డివిజన్‌కు కేటాయిస్తూ రెండురోజుల క్రితం జలవనరులశాఖ ఎస్‌ఈ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సంగం బ్యారేజ్ పనుల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి అంబటికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి అసంతృప్తి తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చారు. సంగం బ్యారేజీకి సంబంధించిన పనుల పర్యవేక్షణ, సాంకేతికత నియంత్రణను నెల్లూరు డివిజన్ పరిధిలోనే ఉంచాలని ఆయన మంత్రిని కోరారు. నియంత్రణను ఆత్మకూరు డివిజన్‌కు మార్చితే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన మంత్రికి చెప్పారు. దీంతో వెంటనే అంతకు ముందు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయమని మంత్రి ఆదేశించారు. దీంతో జలవనరులశాఖ సీఈ హరినారాయణరెడ్డి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు.
అయితే పోటా పోటీగా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా దీనిపై మంత్రి అంబటికి ఫిర్యాదు చేశారు. బ్యారేజ్ పనుల్ని సెంట్రల్ డివిజన్ ఈఈ, బుచ్చిరెడ్డిపాలెం డీఈలు చూస్తున్నారని, దీంతో.. తమకు అక్కడి పనులను పర్యవేక్షించడం కష్టంగా ఉందని తెలిపారు. తమ పరిధిలో జరిగే సమీక్ష సమావేశాలకు ఆయా అధికారులు రాకపోవడంతో అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడంలేదని, వాటి పురోగతిపై సరైన సమాచారం లేదని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పనులను ఇతర నియోజకవర్గాలకు చెందిన డివిజన్ అధికారులు ఎలా నిర్వహిస్తారని అడిగారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సీఈ, ఎస్‌ఈ తో మాట్లాడతానని చెప్పారు. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ నెలలో బ్యారేజ్ ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకుంటున్న సందర్భంలో.. చివర్లో ఇలా ఎమ్మెల్యేలు పేచీ పెట్టడంతో వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.