అందరి ముందు తిట్టాడని నరికేశాడు- నెల్లూరు జంట హత్య కేసులో అసలు ట్విస్ట్
నెల్లూరు జంట హత్యల కేసుని పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలు కాదు, దొంగతనం కాదు, అందరి ముందు తనను అవమానించాడన్న కోపంలో మృతుడికి చెందిన హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి చేసిన దారుణం ఇది.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన నెల్లూరు డబుల్ మర్డర్ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఎన్నో కోణాల నుంచి విచారించిన పోలీసులు... అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. ఇలాంటి వాటికి కూడా మర్డర్స్ చేస్తారా అని స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. ఆస్తి తగాదాలు కాదు, దొంగతనం కాదు, అందరి ముందు తనను అవమానించాడన్న కోపంలో మృతుడికి చెందిన హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి చేసిన దారుణం ఇది.
నెల్లూరులో హోటల్ నిర్వాహకులు కృష్ణారావు, సునీతను హోటల్ లో పనిచేసే వ్యక్తులే హత్య చేశారనే విషయం బయటపడింది. కృష్ణారావు, సునీత స్థానికంగా శ్రీరామ క్యాంటీన్ నిర్వహిస్తుంటారు. ఈ హోటల్ లో పనిచేసే ఉద్యోగుల్లో శివ, రామకృష్ణ కూడా ఉన్నారు. వీరిద్దరూ బంధువులు, వరుసకు బావ, బావమరిది అవుతారు. ఇటీవల సప్లయర్ శివను కృష్ణారావు కోపడ్డారు, అందరి ముందు మందలించారు. దీంతో శివ కృష్ణారావుపై కక్షగట్టాడు. ఇంటికి వెళ్లి అతడిని, అతని భార్య సునీతను కూడా చంపేశాడు. ఈ జంట హత్యల్లో ఇతడికి రామకృష్ణ సహకరించాడని తెలుస్తోంది.
హత్య జరిగిన తర్వాత ఇంటిలోని వస్తువులు పెద్దగా చోరీకాలేదు, కొంతమొత్తం నగదు కనిపించకుండా పోయినా, నగలను మాత్రం ముట్టుకోలేదు. దీంతో ఇది దోపిడీ కోసం చేసిన పని కాదని పోలీసులు నిర్థారించుకున్నారు. అందులోనూ హత్యలు అర్థరాత్రి జరిగాయి. దీంతో ఈ హత్యల వెనక వేరే కారణం ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేష్ ప్రారంభించారు. కృష్ణారావు, సునీత నిర్వహించే హోటల్ సమాచారం సేకరించారు. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ప్రత్యేక పోలీసు బృందాలతో వేట..
నెల్లూరులో జరిగిన జంట హత్యల కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఇంత ఘోరం జరగకపోవడం, పైగా ఒకేసారి జంటహత్యలు, ఇంట్లోనే గొంతుకోసి దారుణంగా చంపడం, రోజులు గడుస్తున్నా అనుమానితుల్ని కూడా పట్టుకోలేకపోవడంతో పోలీసులు మరింత సీరియస్ గా కేసుపై ఫోకస్ పెట్టారు. వేదాయపాళెం, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లతో ముందు రెండు బృందాలు ఏర్పాటు చేసారు. ఆ తర్వాత ఎస్పీ ఆదేశాలతో ముగ్గురు ఇన్ స్పెక్టర్లతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆర్థిక లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఆస్తి విషయంలో ఆ కుటుంబానికి ఎవరితోనూ వివాదాలు లేవని తెలుసుకున్నారు. ఇక పాత కక్షలు కూడా లేవని తేలింది. దీంతో హోటల్ లో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు పరిశోధన సాగించారు.
సీసీ టీవీ ఫుటేజీ కీలకం..
హత్యలు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులు సంఘటన జరిగిన తర్వాత అశోక్ నగర్ నుంచి పడారుపల్లి మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్పీ, పోలీసు బృందం పడారుపల్లి వైపు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. కానీ స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూతో హోటల్ లో కూపీ లాగారు. దీంతో హోటల్ లో ఇటీవల కృష్ణారావు తిట్టడం, దాంతో శివ అనే సర్వర్ మనస్తాపానికి లోనైన విషయం తెలిసింది. దీంతో పోలీసులు శివ, అతడి బావమరిది రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడింది. తనను అందరి ముందు అవమానించారన్న కారణంతోనే కృష్ణారావు దంపతులను హత్య చేసినట్టు శివ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.