ఎవరో సపోర్ట్ చేస్తే నేను ఎదగలేదు- నాకు ఆ రెండు ఉంటే చాలు: అనిల్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఫైరయ్యారు. కొన్ని ఛానెల్స్ తనపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పక్కవారి భజన చేసుకుంటే పర్లేదని, కానీ తనపై బురదజల్లడం ఎందుకన్నారు.
పనిగట్టుకొని కొన్ని ఛానల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఫైరయ్యారు. కొన్ని ఛానెల్స్ తనపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పక్కవారి భజన చేసుకుంటే పర్లేదని, కానీ తనపై బురదజల్లడం ఎందుకన్నారు. ఎవరో తనని సపోర్ట్ చేస్తే తాను పైకి ఎదగనని, అలా అనుకోవడం వాళ్ల భ్రమేనన్నారు. తనకి సీఎం జగన్ ఆశీస్సులు, నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులు ఉంటే చాలన్నారు అనిల్ కుమార్ యాదవ్.
కొన్ని ఛానెల్స్ తనకి వ్యతిరేకంగా వార్తలు రాయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేవలం తనను టార్గెట్ చేసుకునే వార్తలు రాస్తున్నారని, పక్కవారికి మాత్రం భజనలు చేస్తున్నారని అన్నారు. బ్రోకర్ ఛానెల్స్, బ్రోకర్ జర్నలిజం అంటూ మండిపడ్డారు. రాత్రుళ్లు పక్క పార్టీవాళ్లతో మాట్లాడటం తనకు తెలియదని, అలాంటి ములాఖత్‌లు తనకు నచ్చవని చెప్పారు. నెల్లూరు నగరంలో ఇటీవల సీఎం జగన్ ప్రారంభించిన నెల్లూరు బ్యారేజ్ విషయంలో కొన్ని చిన్ని చిన్న పనులున్నాయని, వాటిని పూర్తి చేసేలోగా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. పదిరోజుల్లో బ్యారేజ్ నుంచి రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
19 పార్క్ లు ప్రారంభిస్తున్నా..
నెల్లూరు నగరంలో గతంలో ఎవరో అభివృద్ధి చేశారనేది వట్టి భ్రమ అన్నారు అనిల్ కుమార్ యాదవ్. గత ప్రభుత్వ హయాంలో వేసిన నాసిరకం రోడ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. వైసీపీ హయాంలోనే నెల్లూరు నగర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. నెల్లూరు నగరానికి తాను తెచ్చినన్ని నిధులు ఇంకెవరూ తేలేదని అన్నారు అనిల్. తాను డెవలప్ చేయలని, వారేదో పీకారని అనుకుంటున్నవారు చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. నెల్లూరు నగర అభివృద్ధిపై తానెప్పుడూ చర్చకు సిద్ధంగానే ఉంటానని అన్నారు.
బ్యారేజ్ గురించి తప్పుడు రాతలెందుకు..?
నెల్లూరు బ్యారేజ్‌ని ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించారు. అయితే బ్యారేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై అనిల్ మండిపడ్డారు. బ్యారేజ్ కి కొన్ని టచప్స్ జరుపుతున్నాయని, గృహప్రవేశం అయినా కూడా ఇంటికి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయని అన్నారు అనిల్. వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో 15ఏళ్లుగా బ్యారేజ్ పనులు నత్తనడకన సాగిపోతుంటే అప్పుడు గొడవచేయనివారు, ఇప్పుడెందుకు రెచ్చిపోతున్నారని అన్నారు అనిల్.
అనిల్ ఆగ్రహం ఎవరిపై..?
గతంలో కూడా అనిల్ పక్క పార్టీల వారితో ములాఖత్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దుష్ప్రచారం చేసే నాయకులు రాత్రయితే తమ పార్టీ నాయకులతో కూడా టచ్‌లో ఉంటారంటూ ఆయన బాంబు పేల్చారు. తాజాగా మరోసారి రాత్రిపూట ములాఖత్ లు అంటూ ఆయన ఆరోపించారు. అలాంటి అలవాట్లు తనకు లేవని, అందుకే తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తనకు కేవలం సీఎం జగన్, నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులు ఉంటే చాలన్నారు అనిల్.