Nagababu Call To Nellore Dalit Victim : కావలి పెట్రోల్ బంక్ దాడి బాధితునికి నాగబాబు భరోసా - ఫోన్ పరామర్శ !
కావలిలో పెట్రోల్ బంక్‌లో పని చేసే యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులకు పైపై కేకులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. బాధితులకు నాగబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
Nagababu Call To Nellore Dalit Victim : నెల్లూరు జిల్లా కావలిలో పెట్రోల్ అప్పుగా పోయనని చెప్పినందుకు వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీటీసీ ఒకరు పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న దళిత యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితునికి జనసేన నేత నాగబాబు ఫోన్ చేశారు. "నీకు జరిగిన అన్యాయం చాలా బాధాకరం తేజ, జనసైనికుల నుంచి నీకు ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు, నీతోపాటు మేమున్నాం. నెల్లూరులో జనసైనికులకు నేను అన్నీ వివరంగా చెబుతాను. నెల్లూరు, కావలి వారు కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు. కులం, మతం పక్కనపెడితే.. బేసిక్ గా ఓ మనిషిగా మనం మనకు సాయపడాలి. కులం పేరుతో దూషిస్తేనే అట్రాసిటీ కేసు పెడతారు, నీ విషయంలో హత్యాయత్నం కూడా జరిగింది. దీనిపై పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు." నెల్లూరు జిల్లాలో దళిత యువకుడు తేజకు నాగబాబు ఇలా ధైర్యం చెప్పారు. ప్రస్తుతం తేజ నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగబాబు ఫోన్ లో తేజను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
పాలిటెక్నిక్ చదువుకుంటూ పార్ట్ టైమ్‌గా పెట్రోల్ బంక్‌లు పని చేస్తున్న తేజ
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలో దగదర్తిలో పాలిటెక్నిక్ చదువుతూ పార్ట్ టైమ్ గా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న గోచిపాతల తేజ అనే దళిత యువకుడిపై ఇటీవల వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడు దాడి చేసిన విషయం తెలిసిందే. వాహనంలో పెట్రోల్ కొట్టించుకునే విషయంలో వివాదం మొదలైంది. ఎంపీటీసీ నేరుగా వచ్చి దళిత యువకుడు తేజపై దాడి చేశాడు. ఈ వ్యవహారం సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వ్యవహారంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నిందితుడిపై చిన్న చిన్న కేసులు పట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సింది పోయి.. స్టేషన్ బెయిల్ వచ్చేలా కేసు పెట్టి మమ అనిపించారు. ఆ తర్వాత దళిత యువకుడు తేజకి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజకు తాము అండగా నిలబడతామన్నారు. జనసేన నాయకుడు నాగబాబు నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన నాయకులు వైసీపీ ఆగడాలపై ధ్వజమెత్తారు. దళితుల పాలిటి యమపాశంలా వైసీపీ నాయకుల వ్యవహారం తయారైందని అన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. 307,ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా నామమాత్రపు కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇప్పించారని, తప్పకుండా దీనిపై జనసేన లీగల్ టీం తరఫున పోరాడతామన్నారు.
నిందితుడిపై అట్రాసిటీ కేసు పెట్టాలని జనసేన పోరాటం
ఇటీవల ముసునూరు కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆ తర్వాత చంద్రబాబు పర్యటనకు ముందు పైడి హర్ష అనే యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇప్పుడు మరో దళిత యువకుడు తేజపై నేరుగా దాడి జరిగిందని జనసేన నేతలు ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలతోనే ఇవన్నీ జరగుతున్నాయని అన్నారు. వైసీపీ మహేష్ నాయుడు ఎవరో తమకు కూడా తెలియదని, అంత మాత్రాన తమపై కూడా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. తేజకు అండగా తాము ఉంటామని, తమ తరపున నాగబాబు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్న ఒక దళితుడిపై విచక్షణారహితంగా అతని విధులకు ఆటంకం కలిగిస్తూ దాడి చేసిన మహేష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన నాయకులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.