Anil Kumar Yadav: నాపై కుట్రపన్నే వాళ్లు పన్నొచ్చు, వెన్నుపోటూ పొడవొచ్చు - ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యలు
గడపగడపకు కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు జిల్లా వైసీపీలో దాదాపుగా అనిల్ కుమార్ యాదవ్ ని ఒంటరిగా మార్చేశారు. ఇటీవల జరిగిన రొట్టెల పండగలో కూడా అనిల్ పెద్దగా కనిపించలేదు. అనిల్ వైరి వర్గం రూప్ కుమార్ యాదవ్ తోనే మంత్రి కాకాణి, ఎంపీ ఆదాల కలిసి కనిపించారు. దీంతో అనిల్ ఈరోజు (ఆగస్టు 3) నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రపన్నే వాళ్లు పన్నొచ్చని, వెన్నుపోటు పొడవాలని అనుకునేవారు పొడవచ్చని అన్నారు. మీడియా కూడా తనపై తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ప్యాకేజీల కోసం అమ్ముడు పోయిన కొందరు పక్కవారు ఏం చేసినా కవర్ చేస్తూ వార్తలిస్తున్నారని అన్నారు. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడని, ఆయన చూస్తూనే ఉంటారని చెప్పారు. గతంలో సీఎం జగన్ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు తనకు మెండుగా ఉంటాయని చెప్పుకునే అనిల్, ఇప్పుడు కేవలం భగవంతుడి పేరు మాత్రమే చెప్పడం విశేషం.
నెల్లూరు నగరంలో ఎక్కడ ఏ మూల జరిగిన అన్నిటికీ తానే బాధ్యత అన్నట్టు కొన్ని యూట్యూబ్, కొన్ని ఛానళ్లు లక్ష రూపాయలు, రూ.50 వేల ప్యాకేజీలు తీసుకొని అవాస్తవ కథనాలు రాస్తున్నారని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా స్థానిక 14వ డివిజన్లో గురువారం సాయంత్రం ఆయన ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
సొంత బాబాయ్ శత్రువుగా..
అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబాయ్ రూప్‌కుమార్ యాదవే ఆయనకు బద్ధ శత్రువుగా మారారు. అనిల్‌కు పోటీగా జగనన్న భవన్ పేరుతో మరో ఆఫీసును ప్రారంభించారు. ఇక నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా కొంత కాలంగా అనిల్ కుమార్ కు దూరంగా ఉన్నారు. అనిల్‌ను పిలవకుండానే సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు ఓ గొప్ప వ్యక్తి సహకారంతో నుడా ఛైర్మన్ పదవి వచ్చిందని, అంతేకానీ, అనిల్ చేసిందేమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
మరోవైపు మంగళపూడి శ్రీకాంత్‌రెడ్డి వైసీపీ నేతను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రమేయం లేకుండానే నియమించారు. ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిఫారసు మేరకే శ్రీకాంత్ రెడ్డిని నియమించినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పార్టీ పదవి ఇవ్వడాన్ని అనిల్ అవమానంగా భావించినట్లుగా చెబుతున్నారు.
మరోవైపు, తన ప్రత్యర్థి అయిన సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనిల్ గతంలో జగన్ ను కలిసిన సందర్భంగా కోరినట్లు ప్రచారం జరిగింది. అది సాధ్యపడకపోవడంతో అనిల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.