Nellore: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. స్కూల్స్‌కు సెలవు
వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది జిల్లా యంత్రాంగం.
వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 12 గంటల్లో జిల్లాలోని తడలో అత్యథికంగా 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అటు నెల్లూరు నగరంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నెల్లూరులో చినకు పడితే చిత్తడే..
నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు కొలిక్కి రాకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చినుకు పడిచే చాలు డ్రైనేజీల్లోనుంచి నీరు పొంగి పొర్లుకుంటూ రోడ్లపైకి వస్తుంది. దీంతో రోడ్లన్నీ కాలవలను తలపిస్తుంటాయి. వర్షం పడితే వాహనదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు అండర్ బ్రిడ్జ్ ల వద్ద వాననీరు నిలబడితే ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది.
స్కూల్స్‌కు సెలవులు
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతుండటంతో రెండు జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వాయుగుండం తమిళనాడులోని కడలూరు సమీపంలో సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని, దాని ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఈరోజు ఆఫీస్ లకు సెలవలు ప్రకటించాయి.
అభ్యర్థులకు తిప్పలు..
నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాల్టీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. భారీ వర్షాలకు అభ్యర్థులు ప్రచారానికి రావడానికి హడలిపోతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 15న పోలింగ్ కు టైమ్ దగ్గరపడటంతో అభ్యర్థులు భారీ వర్షంలోనూ హడావిడి పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఎక్కువగా చెన్నైపై కనపడుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. దీంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తడలో 7.5 సెంటీమీటర్లు, వాకాడులో 6, నాయుడుపేటలో 5.4 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ఇక గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: పోకో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. మరో బడ్జెట్ మొబైల్!
Also Read: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, హై అలర్ట్
Also Read: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది