నెల్లూరు ఘటనపై పోలీసు అధికారుల దిద్దుబాటు చర్యలు
నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫామ్ కోసం మగటైలర్లు కొలతలు తీసుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. దీనికి బాధ్యులను చేస్తూ కొందరిపై చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. లేడీ కానిస్టేబుళ్ల యూనిఫామ్ కోసం మగవాళ్లు కొలతలు తీసుకోవడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో యూనిఫామ్ కొలతలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్‌ల నుంచి కొలతలు తీసుకున్నారు. అయితే మహిళలు చేయాల్సిన పనిని ఇద్దరు పురుషులకు అప్పగించారు.
పురుషులు కొలతలు తీసుకోవడం ఏంటని చాలా మంది అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ తంతంగాన్ని షూట్ చేసి మీడియాకు విడుదల చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.
దీంతో నిజానిజాలు నిర్దారించుకున్న తర్వాతే ఏబీపీ దేశం విషయాన్ని రిపోర్ట్ చేసింది. దీనిపై ఎస్పీ ఆఫీస్ అధికారులు కూడా స్పందించారు. ఇకపై భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చేస్తామంటూ వివరణ ఇచ్చారు.
మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జిల్లా యస్.పి. గారు.
— Nellore Police (@sp_nlr) February 7, 2022
◆యస్.పి. గారి సమక్షంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి ఆధ్వర్యంలో ఉమెన్ SI, ఉమెన్ టైలర్స్, స్టాఫ్ ద్వారా తీసుకుంటున్న మహిళా పోలీసుల క్లాత్స్ మెజర్ మెంట్స్..@APPOLICE100 pic.twitter.com/sxjyO5rnsb
ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నమ్మ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లోకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే దగ్గర ఇంచార్జ్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మహిళలతోనే అక్కడ కొలతలు తీసుకున్నారు. కొంతమంది కావాలని వీడియోలు వైరల్ చేస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లకు తెలియకుండా వారి యూనిఫామ్ కొలతలు తీసుకునే సమయంలో ఫొటోలు వీడియోలు తీశారని, వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
వాస్తవానికి మహిళా కానిస్టేబుళ్ల యూనిఫామ్ తయారీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కానీ కొలతలు తీసుకునే దగ్గర మహిళా స్టాఫ్ ఉండాల్సింది, బయట నుంచి పురుషులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పురుషులు తమ యూనిఫామ్ కొలతలు తీసుకోవడంతో కొంతమంది మహిళా కానిస్టేబుళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం వైరల్ కావడంతో ఎస్పీ వెంటనే అక్కడికి వచ్చారు. ప్రస్తుతం మహిళా స్టాఫ్ తో మాత్రమే యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, మహిళల గోప్యతకు భంగం కలిగించే వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయొద్దని అంటున్నారు ఎస్పీ విజయరావు.
◆ అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశాలు
— Nellore Police (@sp_nlr) February 7, 2022
◆ వెంటనే జిల్లా యస్.పి.గారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించి,అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి ఆధ్వర్యంలో జరిగేలా మహిళా టైలర్స్ నే నియమించాలని ఆదేశాలు.@APPOLICE100
నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా అంటూ మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కూడా దీన్ని సమర్థిస్తూ మీడియాను బెదిరించడమేంటని నిలదీశారు రామకృష్ణ. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాక్షాత్తు రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదని ప్రశ్నించారు.