CM Jagan : ఈ నెల 27న నెల్లూరుకు సీఎం జగన్, అధికారుల్లో టెన్షన్
ఈనెల 27న నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
విశాఖ గర్జన తర్వాత ఎయిర్ పోర్ట్ లో మంత్రుల కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి తెలిసిందే. ఆ తర్వాత మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేన నాయకులనుంచి అపాయం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఈనెల 27న నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లోని మూడో యూనిట్ ను జగన్ జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
- గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణం
- ఉదయం 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద హెలిప్యాడ్ కి చేరిక
- 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు నేలటూరులో పర్యటన
- 1.10నుంచి బహిరంగ సభ
- సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరిక
ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షించారు.
హడావిడి ఎందుకంటే...?
వాస్తవానికి సీఎం పర్యటన అంటే సహజంగానే భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. కానీ ఈసారి జగన్ పర్యటనను అడ్డుకోడానికి వామపక్షాలు, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. జనసేన కూడా వారికి మద్దతుగా నిలిచింది. దీంతో సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అధికారులు. జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనను ఎమ్మెల్సీ తలశిల రఘురాం సమన్వయం చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు వారం రోజులుగా ఇదే పనిపై దృష్టిసారించారు. నేలటూరులో ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వెళ్లి వస్తున్నారు.
వామపక్షాల ఆందోళన ఎందుకంటే..?
ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికావడంతో సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు.
అయితే థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ ని జాతికి అంకితం చేసిన తర్వాత దాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. వీరికి మద్దతుగా వామపక్షాలు ఉద్యమం మొదలు పెట్టాయి. జనసేన, టీడీపీ కూడా వారికి మద్దతిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతో ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటున్నారు ఉద్యమ నాయకులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల ఉద్యమ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగించాలని అధికారులు హడావిడి పడుతున్నారు.