నెల్లూరుకు చంద్రబాబు- ఆ మూడు నియోజకవర్గాలపై ఫోకస్
చంద్రబాబు నెల్లూరు పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది.
చంద్రబాబు నెల్లూరు పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన రాయలసీమలో పర్యటించారు, ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు, ఆ తర్వాత ఈనెల 28, 29, 30 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. గతంలో భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలం అయిన సందర్భంలో పరామర్శకు వచ్చిన చంద్రబాబు, మళ్లీ ఇప్పుడు జిల్లాకు వస్తున్నారు.
ఆ మూడు నియోజకవర్గాలపై దృష్టి..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ, విభజన తర్వాత కొత్త జిల్లాలో కానీ టీడీపీకి అసలు సీట్లే లేవు. కానీ జిల్లాలో పట్టుకోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. కొత్తగా ప్రకాశం జిల్లానుంచి నెల్లూరులో కలసిన కందుకూరు నియోజకవర్గంతో సహా కావలి, కోవూరు నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ పెంచింది. దీనికి అనుగుణంగానే చంద్రబాబు ఆ మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు.
కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు, స్థానిక టీడీపీ శ్రేణుల్ని ఉత్తేజపరిచేందుకు ఆ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. 2014లో వైసీపీ తరపున కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు 2019లో టీడీపీలో చేరి పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి మానుగుంట చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న పోతుల రామారావు, దివి శివరాం కూడా అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వారిలో ఒకరికి, లేదా వారిద్దరూ సూచించిన వారికి అక్కడ టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఇంటూరు నాగేశ్వరరావు ఉన్నారు.
కందుకూరు తర్వాత చంద్రబాబు కావలికి వస్తారు. కావలిలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా మాలేపాటి సుబ్బానాయుడు. 2019లో కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి కావలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు అధిష్ఠానంతో కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా మాలేపాటిని నియమించారు. మాలేపాటి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. 2024లో వైసీపీ స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కే టికెట్ ఇచ్చే అవకాశముంది. ఇటు టీడీపీ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ కేటాయించాలనే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ మాలేపాటి మాత్రం దూకుడు మీద ఉన్నారు. టికెట్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు చంద్రబాబు పర్యటనతో స్థానిక నాయకుల్లో ఉత్సాహం వస్తుందని అంటున్నారు. ఇన్ చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు.. చంద్రబాబు పర్యటనకోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపలో హుషారుగా ఉన్నారు. పదే పదే చంద్రబాబుపై ఆయన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయనకు చెక్ పెట్టడానికి కోవూరులో యువ నాయకత్వాన్ని తయారు చేస్తోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొడుకు పోలంరెడ్డి దినేషన్ రెడ్డిని ఇక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ప్రకటించారు. వచ్చే దఫా ఎన్నికల్లో దినేషన్ రెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా టీడీపీకి విజయావకాశాలున్నాయని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఈ మూడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇటీవల మాండోస్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న నేపథ్యంలో రైతులతో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు.