Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి, ఫర్నీచర్ మొత్తం ధ్వంసం
Kovur EX MLA Prasanna Kumar Reddy | కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడి ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు.

Nallapareddy Prasanna Kumar Reddy News | నెల్లూరు: కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాడి చేశారు. అల్లరిమూకల దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసమైంది. కారుపై సైతం దాడి చేసి ఉల్టా పల్టా చేసి వెళ్లిపోయారు. ఇంట్లో విలువైన వస్తువులు మొత్తం పగలగొట్టారు. ఈ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు అల్లరి మూకలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, కారు ధ్వంసం చేయగం హాట్ టాపిక్ అవుతోంది. కోవూరులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.

వేమిరెడ్డిపై అనిల్ ఫైర్...
వేమిరెడ్డి దంపతులపై మర్డర్ కేసు కట్టాల్సిందే అని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. డబ్బుందన్న అహంకారంతో ప్రసన్నకుమార్ రెడ్డి అన్న ఇంటిపై దాడులు చేయించారు. ప్రసన్న కుమార్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇలాంటి నీచ సంస్కృతి ఎప్పుడూ చూడలేదు అన్నారు. రాజకీయాల్లో ఎక్కడైనా విమర్శలు చేస్తే ప్రతివిమర్శలు చేయడం చూస్తుంటాం... కానీ ఇలాగ దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ దాడులు చేసింది మేమే అని చెప్పగల దమ్ము ధైర్యం వేమిరెడ్డికి ఉందా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి విధ్వంసాలకు పాల్పడటం దారుణం అని, వైసీపీ నేతలు దాడులకు భయపడతాము అనుకుంటే పొరపాటే అన్నారు. వేమిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.






















