(Source: ECI/ABP News/ABP Majha)
Nellore Anam : నా సీటుకు ఎసరు పెట్టేశారు - మరోసారి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు !
ఎన్నికలకు ఏడాది ఉండగానే తన కుర్చీ లాగేయాలని కొంతమంది చూస్తున్నారని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. ఏడాది వరకు ఆ సీటు తనదేనని, ఆ తర్వాత వారు ఎక్కడ కూర్చున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.
Nellore Anam : మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. వరుసగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న ఆయన ఈ సారి పార్టీలో అంతర్గత గొడవల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుర్చీకి ఎసరు పెట్టే నాయకులు పుట్టుకొస్తున్నారని, ఏడాదికి ముందే ఆ కుర్చీ నాదని కొంతమంది చెప్పుకుంటున్నారని అన్నారు. దీనిపై మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వార్తల్ని అధిష్టానం చెవిన పడేయాలని, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు.
అంత తొందరెందుకు..?
ఎన్నికలకు ఏడాది ఉండగానే తన కుర్చీ లాగేయాలని కొంతమంది చూస్తున్నారని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. తనను ఐదేళ్ల కు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. మరో ఏడాది వరకు ఆ సీటు తనదేనని, ఆ తర్వాత వారు ఎక్కడ కూర్చున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. జగనన్న ముద్ర ఉందని అలాంటివారు చెప్పుకుంటున్నారని, కానీ తనకు ప్రజలు ఇచ్చిన రాజ ముద్ర ఉందని అన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తాను నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్ని భుజాన మోస్తున్నానని అన్నారు ఆనం.
నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఈ సారి వెంకటగిరి టిక్కెట్ ఇస్తారా?
వెంకటగిరి నుంచి వచ్చే సారి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆనం రామనారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఉన్నన్ని రోజులు ఆ కుర్చీ తనదేనంటున్నారంటే.. కచ్చితంగా ఆయన మరో దఫా వెంకటగిరిలో పోటీ చేయబోరని తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా తనను ప్రజలు ఆదరించారని, నిత్యం తాను ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేనని, ఎక్కడికెళ్లినా ప్రజల ఆశీర్వాదం తనకు ఉంటుందన్నారు. అంటే కచ్చితంగా ఆనం నియోజకవర్గాన్ని మార్చుతారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.
తొలి దఫా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అలిగారు, రెండో దఫా కూడా ఆయనకు పదవి రాకపోవడంతో మరింత అసంతృప్తి పెరిగింది. అదిప్పుడు పెద్దదై చివరకు అధిష్టానాన్ని ధిక్కరించే వరకు వచ్చింది. కొత్తగా వెంకటగిరి సీటు నాదేనంటూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం, దాన్ని సీనియర్లెవరూ ఖండించకపోవడంతో పరిస్థితిలో మార్పు వచ్చేస్తోంది. అంటే ఆనం కచ్చితంగా పార్టీ ఫిరాయిస్తారనే పుకార్లు మొదలయ్యాయి.
ప్రభుత్వంపై వరుస విమర్శలు !
ఏం పనులు చేశామని జనం మనకు ఓట్లు వేస్తారంటూ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఈరోజు మరో రూపంలో తన అసంతృప్తి బయటపెట్టారు. ఇటీవల వెంకటగిరి సీటుకి తాను కూడా పోటీ ఉన్నానంటూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు. పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికలకు ఏడాది ముందే కొంతమంది వెంకటగిరిపై ఆశపడుతున్నారన, తన సీటుకి ఎసరు పెట్టాలనుకుంటున్నారని చెణుకులు విసిరారు. మీకు జగనన్న ముద్ర ఉంటే నాకు రాజముద్ర ఉందని చెప్పారు ఆనం. నేనున్నంత వరకు నా కుర్చీ నాదే, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక్కడుంటానే, వేరే దగ్గరకి పోతానా, అసలు ఇంటికే పోతానా అనేది తర్వాతి విషయం అన్నారు. అయితే తానున్నంత వరకు అధికారులతో కలసి పనిచేస్తాను, చేయిస్తానని చెప్పారు. ఈ బాధలు, ఇబ్బందులు, సమస్యల మధ్య వాలంటీర్లు, కన్వీనర్లతో కలసి పోరాటం చేయడం తనకో గొప్ప అవకాశం అన్నారు ఆనం.