Amarnath Pilgrims: అమర్ నాథ్ యాత్రకు నెల్లూరు యాత్రికులు, వారి పరిస్థితేంటి? వివరాలు చెప్పిన కలెక్టర్
అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన.
అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన. వారిలో 61 మంది తొలుత అందుబాటులోకి వచ్చారని, ఆ తర్వాత మిగతా 17 మంది ఫోన్ కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి వెళ్లిన యాత్రికులంతా మొత్తం 78మంది సురక్షితంగా తిరుగు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వ డయల్ 1902 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నెల్లూరు జిల్లాలో కూడా మరో కంట్రోల్ రూమ్ పెట్టారు. టోల్‌ఫ్రీ నంబరు 1077 ని ఈ కంట్రోల్ రూమ్ కి కేటాయించారు. ప్రస్తుంత ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేస్తున్నాయని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు ట్రావెల్స్ లో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే అందులో నలుగురు ముందుగానే తమ యాత్ర రద్దు చేసుకున్నారని అన్నారు. మొత్తం 78 మంది యాత్రకు వెళ్లగా అందరూ క్షేమంగా ఉన్నారని, వారి బంధువులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
యాత్ర తిరిగి ప్రారంభం..
వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజులపాటు అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్లు పూర్తయిన తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంది అని నిర్థారించుకున్న తర్వాత తిరిగి సోమవారం నుంచి అమర్ నాథ్ యాత్రను పునఃప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి యాత్రికులు బేస్ క్యాంప్ కి బయలుదేరారు. మొత్తం 4,020 యాత్రికులు ధైర్యంగా ముందుకు కదిలారు. వీరందర్నీ 110 వాహనాలలో బేస్ క్యాంప్ కి తరలిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య వీరిని తరలిస్తున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. సోమవారం బయలుదేరిన వీరంతా.. ఈరోజు అమర్ నాథ్ గుహకు చేరుకుంటారు. అక్కడ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.
మూడు రోజుల క్రితం జరిగిన దుర్ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. యాత్రికులు రాత్రిపూట బస చేసేందుకు లోయ మార్గంలో టెంట్లు వేసుకున్నారు. అయితే ఆ ప్రదేశం సరైనది కాకపోవడం వల్లే ప్రాణ నష్టం అధికంగా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. అలాంటి తప్పు జరగలేదని, ఆప్రాంతం సురక్షితంగా ఉంటుందని అనుకున్న తర్వాతే అక్కడ టెంట్లు వేయించామని చెప్పారు అధికారులు. గతంలో వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ఎటువైపు నుంచి వస్తోందో అంచనా వేసుకుని, దానికి దూరంగా టెంట్లు వేయించామన్నారు. కానీ ఈసారి వరదలు టెంట్లవైపు రావడంతో ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గల్లంతయ్యారు. తిరిగి వారందర్నీ క్షేమంగా ఆస్పత్రులకు తరలించారు ప్రస్తుతం అక్కడ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది.