(Source: Poll of Polls)
Nellore : మద్యం విక్రయాల్లో నెల్లూరు టాప్, ఒకేరోజు రూ.7.30 కోట్ల అమ్మకాలు
నెల్లూరోళ్లు మద్యపానంలో పండగ ప్రతాపం చూపించారు. దసరా సీజన్లో నెల్లూరులో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సర్కారు ఖజానాకు భారీ లాభాలను చేకూర్చాయి.
నెల్లూరోళ్లు ఇరగదీశారు, రికార్డ్ బద్దలు కొట్టారు, సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇదంతా దేంట్లోనో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మందు తాగడంలో. అవును, నెల్లూరోళ్లు మద్యపానంలో పండగ ప్రతాపం చూపించారు. దసరా సీజన్లో నెల్లూరులో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సర్కారు ఖజానాకు భారీ లాభాలను చేకూర్చాయి. దసరా పండగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలతో మందుబాబులు నిజంగానే పండగ చేసుకున్నారు. ఫూటుగా మద్యం తాగి మైకంలో తేలియాడారు. ఒకటా రెండా.. ఏకంగా 7కోట్ల 30లక్షల రూపాయల మద్యం తాగారు. మామూలు రోజుల్లో జిల్లాలో 4కోట్ల 30లక్షల మద్యం అమ్మకాలు జరుగుతాయి. దసరా పండగ రోజు మాత్రం నెల్లూరులో 7కోట్ల 30లక్షల రూపాయల మద్యం అమ్ముడవడం విశేషం.
నెల్లూరు జిల్లాలోని వైన్ షాపులు, బార్లు పండగ రోజు రద్దీగా మారాయి. జిల్లాలో మొత్తం 187 మద్యం దుకాణాలు, 47 బార్లు ఉన్నాయి. వీటన్నింటిలో బుధవారం ఒక్కరోజే రూ.7.30 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కరోజే భారీస్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మొత్తం లెక్కలు ఇంకా బయటకు రాలేదు, కానీ జిల్లా స్థాయిలో తాజాగా అధికారులు గణాంకాలు విడుదల చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఏపీలో కూడా నెల్లూరు టాప్ పొజిషన్లోనే ఉంటుందనే అంచనాలున్నాయి.
అటు తెలంగాణలో కూడా పండగ మద్యం ఏరులైపారింది. ఈ ఏడాది దసరాకి రికార్డు స్థాయిలో మధ్యం అమ్మకాలు తెలంగాణలో జరిగాయి. తెలంగాణలో పండగ మద్యం విగ్రయాలు 1100 కోట్ల రూపాయలను దాటాయని అధికారిక సమాచారం. వారం రోజుల్లో 1100 కోట్ల రూపాయల విలువైన మద్యం స్టాక్ పాయింట్లనుంచి షాపులకు చేరింది. జిల్లాల వారీగా లెక్క తీస్తే.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. రూ.500 కోట్ల మేర మద్యం రంగారెడ్డి జిల్లాలో అమ్ముడైంది. వరంగల్ అర్బన్ లో 149.02 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. నల్గొండ రూ.124.44 కోట్లు, కరీంనగర్ రూ.111.44 కోట్లు, హైదరాబాద్ రూ.108.24 కోట్లలో అమ్మకాలు జరిగాయి.
అప్పటికే దుకాణాలు, బార్లు, పబ్ లలో నిల్వ ఉన్న స్టాకు దీనికి అదనం అని సమాచారం. గతేడాది తెలంగాణలో రూ.406 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగగా ఈ ఏడాది పండగ సందర్భంగా 1100 కోట్ల రూపాయలకంటే ఎక్కువ బిజినెస్ జరగడం విశేషం. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ.926 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.