Nellore Penna Floods : పెండింగ్ లో వరద హామీలు, కష్టాల్లో నెల్లూరు ప్రజలు
Nellore News : ప్రకృతి విపత్తులు ముఖ్యంగా వరదల సమయంలో నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలే అంటున్నారు ప్రజలు. గత ఏడాది నెల్లూరు జిల్లాలో పెన్నా వరదల టైంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
Nellore News : ఇటీవల గోదావరి వరదలపై అధికార, విపక్షాలు మీరేం చేశారంటే, మీరేం చేశారంటూ విమర్శలు గుప్పించుకున్నాయి. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు మీరేం చేశారని ఆ విషయాలు కూడా ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అంత దూరం అవసరం లేదు, ఏడాది క్రితం నెల్లూరు జిల్లాలో పెన్నాకు వచ్చిన వరదలపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారు. అప్పట్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయి? ఎంతవరకు అమలయ్యాయి? ఏబీపీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తేలిన నిజానిజాలివి.
రెండో సాయం ఎప్పుడో?
వరద సాయం రెండు రకాలు. తక్షణ సాయంగా డబ్బులివ్వడం, నిత్యావసరాలివ్వడం ఇందులో ఒకటి. మరోసారి వరదలు వచ్చినా వారికి నష్టం కలగకుండా చేయడం రెండో రకం. ఇక్కడ సీఎం జగన్ మొదటి సాయంలో పాసయ్యారు, కానీ రెండో సాయంలో ఫెయిలయ్యారనే చెప్పాలి. గతేడాది నెల్లూరు నగర వాసులు పెన్నా వరదతో అష్టకష్టాలు పడినప్పుడు ఆయా ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. అప్పటి జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి హామీల వర్షం కురిపించారు.
శంకుస్థాపనకే ఏడాది
అందులో ప్రధాన హామీ నెల్లూరు నగర పరిధిలో పెన్నా ఒడ్డున బండ్ నిర్మాణం. ఈ గట్టు నిర్మాణాన్ని 2022 సంక్రాంతికి మొదలు పెడతామని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. కట్ చేస్తే క్యాలెండర్లో నెలలు గిర్రున తిరిగాయి. అప్పటి మంత్రికి పదవిపోయింది. కొత్తగా మరొకరికి మంత్రి పదవి వచ్చింది. తీరా జగన్ సర్కార్ చేసిందేంటంటే. జులై నెలలో శంకుస్థాపన జరపడం. శంకుస్థాపనకే దాదాపు ఏడాది పడితే.. ఇక వర్షాకాలంలో పనులు సాగేదెలా, గట్టు నిర్మాణం పూర్తయ్యేలోపు వరదలొస్తే ప్రజల సంగతేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నత్తనడకన జగనన్న కాలనీల్లో పనులు
పెన్నాలో నీరు లేకపోతే కరకట్టలపై చాలామంది పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు. వారంతా వరద వచ్చిన సమయాల్లో పెట్టేబేడా సర్దుకుని పరుగులు పెడుతుంటారు. అలాంటి వారికి శాశ్వత నివాసాల పేరుతో జగనన్న కాలనీలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనీసం వచ్చే వర్షాకాలానికైనా తమకు ఇళ్లు మంజూరు చేసి తరలిస్తే వరదలదో హడలిపోయే ప్రమాదం తప్పుతుందని ప్రజలు వేడుకుంటున్నారు.
అతి త్వరలో ప్రారంభం
నెల్లూరు నగర పరిధిలో పెన్నా వారధి, సంగం మండలంలో సంగం వారధి కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని వరదల సమయంలో హామీ ఇచ్చారు సీఎం జగన్. కానీ ఆ రెండూ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. పనులు పూర్తయ్యాయని అతి త్వరలో వీలైతే ఈ నెలలోనే బ్యారేజీలు ప్రారంభిస్తామంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాజాగా ఆయన బ్యారేజ్ పనులను పరిశీలించారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు మాత్రం మిగిలి ఉన్నాయని అంటున్నారు.
పెన్నా, సంగం బ్యారేజీలు
అనిల్ మాటల్లో చెప్పాలంటే 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పనులు 2022లో జగన్ హయాంలో పూర్తవుతున్నాయని అర్థమవుతోంది. అంటే ఈ బ్యారేజీ జీవితకాలం లేటు. పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీ.. రెండూ ఉపయోగంలోకి వస్తే, పెన్నా నీటిని కనీసం కొంతమేరయినా సముద్రంపాలు కాకుండా ఆపొచ్చు. సంగం వారధితో నీటిని ఉత్తర కాల్వలకు మళ్లించవచ్చు. కావలి తీరాన్ని కూడా సస్యశ్యామలం చేయొచ్చు. 2022 సంక్రాంతికి ఈ రెండు వారధులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పటి వరకూ పనులు పూర్తి కాకపోవడం విశేషం. ఇప్పటికి పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించినా.. ప్రారంభోత్సవాలు జరిగే వరకు జనం నాయకులను నమ్మేలా లేరు. ఈ రెండు వారధులు ఉపయోగంలోకి వస్తే, సోమశిల నుంచి నీటిని విడుదల చేసినా.. నెల్లూరు నగర వాసులు మరింత హడావిడి పడే అవకాశముండదు. ఒకేసారి వారిపై వరద ప్రవాహం విరుచుకుపడదు. ఈలోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశముంటుంది.
మొత్తం మీద పెన్నాకు వరదలు వచ్చి ఏడాది కావొస్తోంది. ఇప్పటి వరకూ సీఎం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా గోదావరికి వరదలొచ్చాయి. ఈ వరదల్లో అధికార ప్రతిపక్షాలు మళ్లీ బురద రాజకీయాలకు తెరతీశాయని నెల్లూరు వాసులు అంటున్నారు.
Also Read : BJP TDP Friends : టీడీపీ - బీజేపీ కలసిపోయాయా ? ఉభయతారక వ్యూహం అమలు ప్రారంభించేశాయా ?