Nellore News : మంత్రిపై గెలిచిన సామాన్యురాలు, న్యాయ పోరాటంతో మళ్లీ ఉద్యోగం!
Nellore News : మంత్రి కాకాణి ఆదేశాలతో ఉద్యోగం పోగొట్టుకున్న అంగన్వాడీ టీచర్ న్యాయపోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఉద్యోగం సాధించింది.
Nellore News : అధికారం అన్నిసార్లూ పనిచేయదు. కొన్నిసార్లు అధికారంతో ఆర్డర్లు ఇచ్చినా వాటికి ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి ఉదాహరణే నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా మంత్రి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి అధికారులు ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకుంది. బాధితురాలు నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం సంచలనంగా మారింది. హైకోర్టు ఆదేశాలతో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న బాధితురాలు ఉడతా సుజాత తిరిగి విధుల్లో చేరారు. మంత్రి ఆదేశాలు కూడా ఇక్కడ పనికిరాకుండా పోవడం విశేషం.
అసలేం జరిగింది?
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లి. ఆ నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ నల్లపాలెంలో ఉడతా సుజాత అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులకు ఆమెతో విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం మన చేతిలోనే ఉంది కదా అని, వారు ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అర్జీలు పెట్టారు. కానీ ఫలితం లేదు, దీంతో వారు నేరుగా మంత్రి కాకాణిని కలిశారు. అంగన్వాడీ టీచర్ పై లేనిపోని ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంలేదని, స్థానికంగా ఆమె వల్ల తమ మాట చెల్లుబాటు కావడంలేదని చెప్పారు. దీంతో సహజంగానే మంత్రికి ఆమెపై వ్యతిరేక అభిప్రాయం ఏర్పడింది. ఆమెను తొలగించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. సుజాతపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు లేఖ రాశారు కాకాణి.
మంత్రి తలచుకుంటే..
మంత్రే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, జిల్లా అధికారులు కూడా కాదనలేకపోయారు. అయితే ముందుగా వారు విచారణ చేపట్టారు. అధికారుల విచారణలో ఉడతా సుజాత సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని తేలింది. ఆమె ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని స్థానికులు చెప్పారు. 90 శాతం మంది చిన్నారుల తల్లిదండ్రులు కూడా అదే విషయం అధికారులకు వివరించారు. సుజాతపై వచ్చిన ఫిర్యాదులు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని అధికారులకు తెలుసు, కానీ మంత్రి ఆదేశాలు ధిక్కరించలేని పరిస్థితి. అందుకే సుజాతను విధుల నుంచి తొలగించారు అధికారులు.
కోర్టుకెక్కిన సుజాత
సహజంగా ఇలాంటి విషయాల్లో బాధితులు తిరిగి మంత్రి వద్దకు వెళ్లడమో లేక, స్థానిక నాయకులతో రాజీ చేసుకోవడమో చేస్తారు. కానీ సుజాత అలా చేయలేదు. తల వంచుకుని విధులు నిర్వహించడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే న్యాయపోరాటానికి దిగింది. తాటిపర్తి అంగన్వాడీ టీచర్ సుజాత ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది. తనను అకారణంగా విధులనుంచి తొలగించారంటూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైరోక్టు.. సుజాతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పింది. ఫిర్యాదులుంటే తిరిగి విచారణ జరపాలని, ఆ తర్వాత తమకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులతో అంగన్వాడీ టీచర్ ఉడతా సుజాత తిరిగి విధుల్లో చేరబోతోంది. ఆమె న్యాయపోరాటం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. స్థానిక ప్రజా ప్రతినిధుల విషయంలో భయం భయంతో విధులు నిర్వహిస్తున్న అధికారులకు హైకోర్టు తీర్పుతో ధైర్యం వచ్చినట్టయింది.
Also Read : APSRTC Charges : ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్ఆర్టీసీ