CCTV Market : మూడో నేత్రం, తిరుగులేని రక్షణ తంత్రం
ప్రధాన నగరాల్లోని రహదారులపై సీసీ కెమెరాలు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. నెల్లూరు లాంటి పట్టణాల్లో కూడా ప్రతి రోడ్డులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు.
చేతికి మొబైల్ ఫోన్ ఎలాగో.. ఇంటికి సీసీ కెమెరా అలాగే. సీసీ కెమెరాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఏ బంగారు షాపులోనో లేక, ఏ వీఐపీ ఇంటి ఆవరణలోనో సీసీ కెమెరాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న కిరాణా షాపుల్లో కూడా సీసీ కెమెరాలు బిగించేస్తున్నారు. అపార్ట్ మెంట్లలో ప్రతి ఇంటికీ సీసీ కెమెరా కామన్ గా మారిపోయింది. ప్రతి ఫ్లోర్ కి 2, 3, కెమెరాలు ఫిక్స్ చేస్తున్నారు.
గతంలో ప్రధాన కూడళ్లలోనే సీసీ కెమెరాలు కనిపించేవి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి కూడలిలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసింది. నెల్లూరులాంటి పట్టణాల్లో కూడా ప్రతి రోడ్డులోనూ సీసీ కెమెరాలు కనపడుతున్నాయి. రోడ్డుపై ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసిపోవాల్సిందే. ఇక ప్రైవేటు ప్రాపర్టీస్ విషయంలో కూడా సీసీ కెమెరాల నిఘా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల వాడకం కూడా బాగా పెరిగింది. నగర పరిధిలో గతంలో రోజుకి ఒకటీ రెండు కెమెరాలు అమ్ముడవుతుంటే.. ఇప్పుడు దాదాపు 50చోట్ల కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు.
ఆన్లైన్లో సీసీ కెమెరాల రేటు 1200 రూపాయలనుంచి ప్రారంభం అవుతుంది. స్టోరేజ్ కెపాసిటీ, వీడియో రికార్డింగ్ క్వాలిటీ, కలర్ ఫుటేజ్.. ఇలా కెమెరాల రకాలను బట్టి వాటి ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రకరకాల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మోషన్ క్యాప్చప్ టెక్నాలజీతో మనిషి ఎటువైపు కదిలితే అటువైపు చూసే కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాల్లో వాటి స్టోరీజీ కెపాసిటీనిబట్టి రకరకాలు ఉంటాయి. 20 రోజులనుంచి 6 నెలల వరకు కూడా స్టోరేజ్ ఉంచుకోవచ్చు. సహజంగా సీసీ కెమెరాలను 20రోజుల వరకు స్టోరేజ్ ఉంచేలా చూస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మెమరీ ఎరేజ్ అయిపోతుంది.
ఇల్లయినా, అపార్ట్ మెంట్ అయినా, స్కూల్ అయినా, ఓపెన్ ప్లేస్ అయినా.. ఎక్కడైనా సీసీ కెమెరాలు ఇప్పుడు అవసరమేనంటున్నారు. పొలాల్లో కూడా ఎండ, వానకి తట్టుకుని నిలబడగలిగే కెమెరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా ఒక సిమ్ కార్డ్ వేసి సీసీ కెమెరాని అక్కడ పెట్టొచ్చు, ఫోన్లో ఆ ఫుటేజీని మనం చూడొచ్చు. పొలాల్లో మోటర్ల దొంగతనాలు జరుగుతాయనుకుంటే అక్కడ సీసీ కెమెరాలను నిక్షిప్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల వాడకం పెరిగిన తర్వాత దొంగతనాల సంఖ్య బాగా తగ్గిపోయిందని అంటున్నారు.
విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కుదరదు. అయితే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వారి ఇబ్బందులేంటి అని ఎప్పటికప్పుడు విదేశాల్లో ఉన్న పిల్లలు సీసీ కెమెరాలలో చూస్తున్నారు. అక్కడ ఉన్నా కూడా ఇక్కడ తమవారిని ఓ కంట కనిపెడుతూ భరోసాతో ఉంటున్నారు. ఏదైనా అత్యవసరం అయితే.. తాము అక్కడినుంచే ఇక్కడి వారికి సూచనలిస్తుంటారు. ఇటీవల కాలంలో విదేశాల్లో ఉన్న పిల్లలు.. తల్లిదండ్రుల ఇంటికి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు. ఆస్తుల రక్షణకు కూడా ఇవి ఉపయోగంగా మారాయి. గతంలో కంప్యూటర్ తెరపై మాత్రమే సీసీ కెమెరాల ఫుటేజీ చూసే అవకాశం ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా లైవ్ రికార్డింగ్ ని మనం చూడొచ్చు. సీసీ కెమెరాల వాడకం వల్ల దొంగతనం జరుగుతుందనే భయం తగ్గిపోతుందని, నేరాల నియంత్రణలో కూడా ఇవి బాగా ఉపయోగపడుతాయంటున్నారు ప్రజలు.
అపార్ట్ మెంట్లలో సీసీ కెమెరాల వాడకం బాగా ఎక్కువైంది. కేవలం అపార్ట్ మెంట్ ఎంట్రన్స్ లోనే కాదు, ప్రతి ఫ్లోర్ రోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ ఖర్చులో లిఫ్ట్, వాటర్, జనరేటర్ తో పాటు.. సీసీ కెమెరాల నిర్వహణ కూడా కామన్ గా మారిపోయింది. ఇక పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న సీసీ కెమెరాల విషయానికొస్తే.. కొన్నిచోట్ల అవి నామమాత్రంగానే కనపడుతున్నాయి. కంటికి కనిపించినా అవి పనిచేస్తున్నాయో లేవో అనేది తేలడంలేదు. దీనిపై పోలీసులు శ్రద్ధ పెట్టాలని, సీసీ కెమెరాల నిర్వహణపై దృష్టిపెట్టాలని, అప్పుడే వాటి ఉపయోగం ఉంటుందంటున్నారు స్థానికులు.