(Source: ECI/ABP News/ABP Majha)
Ap Cabinet: ఏపీ కేబినెట్ తొలి భేటీకి ముహూర్తం ఫిక్స్ - అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Andhrapradesh News: కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తరుణంలో ఏపీలో తొలి కేబినెట్ భేటీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి.
AP Cabinet First Meeting: ఏపీలో కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత తొలి కేబినెట్ భేటీకి (AP Cabinet) ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీఎం సంతకాలు చేసిన డీఎస్సీ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి నిర్ణయాలను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, నూతన మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సచివాలయాల్లో తమకు కేటాయించిన బ్లాకుల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బుధవారం డిప్యూటీ సీఎం, మంత్రిగా జనసేనాని పవన్ కల్యాణ్, హోంమంత్రిగా వంగలపూడి అనిత తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టగా.. వారికి నేతలు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అలాగే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేశారు. అనంతరం దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అటు, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయనకు ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. ప్రొటెం స్పీకర్‌గా గురువారం ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 21న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా, స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ఖరారైనట్లు సమాచారం.