Nara Lokesh Vanajangi: ఈ అద్భుత ప్రకృతి సౌందర్యం ఏపీలోనిదే - ఫోటోగ్రాఫర్ ట్వీట్‌కు నారా లోకేష్ రిప్లయ్ వైరల్
Vanajangi: వనజంగి పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ కాదని నారా లోకేష్ అన్నారు. ఓ ఫోటో గ్రాఫర్ పెట్టిన అద్భుతమైన ఫోటోలపై ఆయన స్పందించారు.

Nara Lokesh impresess Vanajangi : ఆంధ్రప్రదేశ్ ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వంజంగి హిల్ స్టేషన్ అందాలను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాకేష్ పులప అనే ఫోటోగ్రాఫర్ వంజంగి గురించి అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. నారా లోకేష్ ఆ ట్వీట్కు రిప్లయ్ ఇచ్చారు.
Vanajangi in #AndhraPradesh never fails to amaze. Magical layers of clouds, golden light, and a calm that words can’t fully capture. This is nature at its most breathtaking. https://t.co/zvWXe6n5JO
— Lokesh Nara (@naralokesh) December 23, 2025
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో వంజంగి ఒక అద్భుతమైన మణిహారంలా మెరుస్తోంది. మంత్రి నారా లోకేష్ వంజంగి అందాలను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది. "వంజంగి ఎప్పుడూ ఆశ్చర్యపరచడంలో విఫలం కాదు.. మంత్రముగ్ధులను చేసే మేఘాల పొరలు, బంగారు కాంతులు, మాటల్లో వర్ణించలేని ప్రశాంతత.. ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతం" అంటూ ఆయన వంజంగిని ఆకాశానికెత్తారు. సముద్ర మట్టానికి సుమారు 3400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందుతున్న పర్యాటక కేంద్రంగా మారింది.
వంజంగి ప్రధాన ఆకర్షణ ఇక్కడి సూర్యోదయం . తెల్లవారుజామున సూర్య కిరణాలు పడుతుంటే, కొండల మధ్య దట్టంగా అలుముకున్న మేఘాలు సముద్రపు అలలలా కనిపిస్తాయి. అందుకే పర్యాటకులు దీనిని 'మేఘాల సముద్రం' (Sea of Clouds) అని పిలుస్తుంటారు. ఆకాశంలో బంగారు రంగులు చిమ్ముతూ సూర్యుడు ఉదయిస్తుంటే, ఆ మంచు తెరల మధ్య ప్రకృతి రమణీయత పర్యాటకులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి, కాశ్మీర్‌ను తలపించే వాతావరణం నెలకొంటుంది.
వంజంగి కేవలం ప్రకృతి ప్రేమికులకే కాకుండా, సాహస యాత్రికులకు, ట్రెక్కర్స్‌కు కూడా ఇష్టమైన ప్రదేశం. సుమారు 5 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ శిఖరాగ్రానికి చేరుకోవడం ఒక మధురమైన అనుభూతినిస్తుంది. అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడానికి మొగ్గు చూపుతున్నారు. పర్యాటక శాఖ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడంతో, గత రెండేళ్లుగా పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది.
నారా లోకేష్ చేసిన ట్వీట్ వల్ల వంజంగికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఎకో-టూరిజం'ను ప్రోత్సహిస్తున్న తరుణంలో, వంజంగి వంటి ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తే రాష్ట్ర ఆదాయంతో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రశాంతతను కోరుకునే వారికి వంజంగి సందర్శన ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.





















