Byreddy Siddharth Reddy : అందుకే తిరుపతి సమావేశానికి వెళ్లలేదు, లోకేశ్ తో భేటీపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాట్ కామెంట్స్
Byreddy Siddharth Reddy : నారా లోకేశ్ తో భేటీ అయ్యారని వచ్చిన వార్తలపై శాప్ ఛైర్మన్ సిద్ధార్థరెడ్డి స్పందించారు. ఆ వార్తలు రాసినవాళ్లు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.
Byreddy Siddharth Reddy : టీడీపీలో చేరుతారని వస్తున్న ఆరోపణలపై శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. నందికొట్కూరులో మాట్లాడిన ఆయన.. కోర్టు వాయిదా ఉండడంతో తిరుపతి సభకు హాజరుకాలేకపోయారన్నారు. తన ప్రోటోకాల్ ఉన్న పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ స్థానిక ప్రోటోకాల్, తనది రాష్ట్ర వ్యాప్త ప్రోటోకాల్ అందుకే ఇద్దరం కలువలేకపోతున్నామన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు కోసం ఎమ్మెల్యే చేసే పనులు తనకు సంబంధం లేదన్నారు. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయిన షాపు యజమానులకు పరిహారం ఇవ్వకుండా దోచుకొని దాచుకున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ ను కలిశానని రాసినవాళ్లు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. టీడీపీలో చేరే ప్రసక్తే లేదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు.
ఆధారాలు చూపించండి
ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న వార్త హల్ చల్ చేసింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. దీంతో టీడీపీలోకి వెళ్తు్న్నారని మీడియా తీవ్రంగా చర్చ జరిగింది. అందుకు శాప్ ఛైర్మన్ పదవిలో ఉన్నా రాష్ట్ర స్థాయి సమావేశానికి సిద్ధార్థరెడ్డి డుమ్మా కొట్టారని ప్రచారం జరిగింది. టీడీపీలో చేరి శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని జోరుగా చర్చ సాగింది. ఈ ప్రచారంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రంగా స్పందించారు.
అందుకే తిరుపతి సమావేశానికి వెళ్లలేదు
"టీడీపీలో జాయిన్ అవుతున్నానని వార్తలు రాసి చివర్లో క్వాశ్చన్ మార్కు పెడతారు. అంటే కేసులు పెడతానని భయం. ఈ వార్తకు మాకు ఆధారాలు లేవని చెప్తారు. లోకేశ్ తో కలిశానని వార్తలు రాశారు ఎవరు రాశారో వాళ్లు ఆధారాలు చూపించాలి. తిరుపతి సమావేశానికి వెళ్లలేదు టీడీపీలోకి వెళ్తున్నానని ప్రచారం చేశారు. కోర్టు వాయిదా ఉండి ఈ సమావేశానికి వెళ్లలేదు. ఇంతలో ఓ ముఖ్యమైన నేత ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతోందని అడిగితే ఆయన దగ్గరకు వెళ్లాను. దీనిపై అసత్య ప్రచారం చేశారు " అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
Also Read : Tamil Nadu Village Secretariats: జగన్ బాటలో సీఎం స్టాలిన్- అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన