Nadendla Manohar: సీఎంకి పాలన చేతగాక దిగజారి మాట్లాడుతున్నారు: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Nadendla Manohar: పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జగన్ ఇంత కంటే దిగజారిపోడు అనుకున్న ప్రతిసారీ మా నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నాడని అన్నారు. పవన్ పెళ్లిళ్ల విషయంలో అత్యున్నత పదవిలో ఉన్న జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరిస్తూ ఎలా ముందుకు వెళళ్తామో చెప్పకుండా వైసీపీ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడుతున్నారిన విమర్శించారు. జగన్‌కు పాలన చేతగాక, మానసిక స్థితి సరిగాలేక ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
వేల కోట్ల అవినీతి
ప్రజాధనంతో నిర్వహించే సభలో రాష్ట్ర భవిష్యత్తుపైనా, యువతకు కల్పించాల్సిన అవకాశాలు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల గురించి మాట్లాడాలని హితవుపలికారు. పవన్ సినిమా షూటింగ్‌ల గురించి జగన్ మాట్లాడటం విచిత్రంగా ఉందని, సినిమాల్లో సంపాదించిన డబ్బుతోనే పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు పవన్ అని అన్నారు. జగన్‌లా రూ.వేల కోట్లు అక్రమ ధనం, అవినీతి ధనం పవన్ దగ్గర లేదన్నారు. జగన్ మాదిరి సంతకం చేసి అవినీతి చేయలేరు. టోఫెల్ పరీక్ష పేరుతో ఒప్పందం చేసుకొని రూ.వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. ఒక హద్దు దాటి జగన్ ప్రతిపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. తమ పార్టీ నాయకులు ఎవరైనా ఆవేశపడి ఏదైనా అంటే పవన్ వద్దని వారిస్తారని చెప్పారు.
వీర మహిళల ఆధ్వర్యంలో నిరసనలు
మహిళల గురించి జగన్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, దీనిపై వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని నాదెండ్ల తెలిపారు. మహిళలే సీఎం జగన్‌కు సమాధానం చెప్పాల్పిన సమయం వచ్చిందన్నారు. మహిళల ఆత్మగౌరవం దిగజార్చేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన బాటలోనే జిల్లాల్లోని వైసీపీ నేతలు సైతం విపక్ష నాయకులు, మహిళలపై ఇష్టానుసారం విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి 5 నెలలే సమయం ఉందని అహంకారంతో పెట్రోగిపోతున్న వైసీపీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
దొంగ లెక్కలు, చీకటి జీఓలు
వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్ర ప్రజలను దొంగ లెక్కలు, చీకటి జీవోలతో మోసం చేస్తోందని నాదెండ్ల విమర్శించారు. చీకటి జీవోలతో, అర్ధం కాని లెక్కలతోనే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మన్యం ప్రాంతంలో 1057 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, దీంతోనే నక్సల్స్ ప్రభావం తగ్గిందని చెప్పుకొచ్చారని, కానీ వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతంలో జరిగింది కేవలం అక్రమ బాక్సైడ్ మైనింగ్ మాత్రమేనని ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో కామ్రేడ్లు ఉండబట్టి కాస్త అయినా వైసీపీ దాష్టీకాలను అడ్డుకట్ట పడిందన్నారు. లేకుంటే మొత్తం కొండలు, గుట్టలు ఖాళీ చేసేవారని మండిపడ్డారు.
ఆ ధైర్యం జగన్‌కు ఉందా?
సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండను బోడిగుండు చేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు. రూ.500 కోట్లతో అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు ఎందుకు..? అంత లగ్జరీగా క్యాంపు కార్యాలయ నిర్మాణం దీనికోసమో ప్రజలకు చెప్పాలని, కేవలం సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించి, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మరో కట్టుకథ చెప్పేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా అక్కడి నుంచే పరిపాలిస్తామని ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఎన్నో వనరులతో కూడిన మన్యం రెండు జిల్లాల నుంచి వైసీపీ పాలనలో 3053 కుటుంబాలు వలస వెళ్లిపోయాయని, రాష్ట్ర మొత్తం మీద 3.31 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయని చెప్పారు.
‘అమిత్ షాతో లోకేష్ భేటీని స్వాగతిస్తున్నాం’
జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అని నాదెండ్ల అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ గారి భేటీని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అంశాలు, రాజకీయ అంశాల గురించి తమ దృష్టికి రాలేదని, కచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ఏతర పక్షాలన్నీ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనేది జనసేన ఆకాంక్ష అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు విజయదశమి తర్వాత నుంచి పుంజుకుంటాయని అన్నారు. జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, పొత్తులు, సర్దుబాట్ల విషయంపై పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.