YSRCP News : జంపింగ్ ఆలోచనలో మైలవరం ఎమ్మెల్యే - సిద్ధం సభకు దూరం - వైసీపీ ప్లాన్ బీ అమలు !
Mylavaram MLA : వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు మైలవరం ఎమ్మెల్యే రాలేనని సమాచారం పంపారు. ఆయన పార్టీ మారే అవకాశం ఉండటంతో కేశినేని నానికి మైలవరం బాధ్యతలు ఇచ్చారు.
YSRCP Mylavaram MLA : మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. జన సమీకరణ చేసేది లేదని ఆయన పార్ట నేతలకు చెప్పారు. దీంతో వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇన్‌చార్జి పడమట సురేశ్ బాబుకు బాధ్యతలు అప్పగించి, సిద్ధం సభకు మైలవరం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చింది. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు.
వసంత వైసీపీ వీడనున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజా ఘటనలతో మరోమారు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఎమ్మెల్యే స్థానాల మార్పుల కారణంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారని సీఎంతో మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడటం లేదని ప్రచారం జరిగింది. ఇప్పటికే మంత్రి జోగి రమేశ్‌తో విభేదాలు ఉండడం, ఇప్పుడు మరో సమస్య రావడంతో వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటకు దిగటంతో క్యాడర్‌లో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడటం పై జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్బావం నుంచి కష్టపడటంతో జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంపై మనస్సు పెట్టుకున్నారు.
అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేయటం ఆరంభించారు. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసన సభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించటంతో వసంత అవమానంగా భావించారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్, శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. అయితే ఇంత జరిగినా హైకమాండ్ జోగి రమేష్ కే అండగా ఉందన్న భావనతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకునంటున్నట్లుగా తెలుస్తోంది.