AP Local Elections : పరిషత్ ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న సస్పెన్స్..! వచ్చే నెల 4న హైకోర్టు విచారణ..!
సింగిల్ జడ్జి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌తో ఉత్సాహంగా ఉన్న వైసీపీ... ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ కూడా నిర్వహిస్తే ఎదురు ఉండదని అనుకుంటోంది. కానీ .. ఆ ఎన్నికల నిర్వహణపై వివాదాలు ఉండటంతో కోర్టు చిక్కులు దాటాల్సి వస్తోంది. ఎస్‌ఈసీ నీలం సహాని సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని.. హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్‌ను కొట్టి వేసింది. నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఏపీ ఎస్‌ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని స్పష్టం చేసింది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేక వివాదాల మధ్య జరిగాయి. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట కరోనా కారణంగా ఎస్‌ఈసీ వాయిదా వేసినప్పుడు ఏపీ ప్రభుత్వం.. వాయిదాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సమయంలో.. సుప్రీంకోర్టు వాయిదాను సమర్థించి.. మళ్లీ ఎన్నికలు పెట్టే ముందు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే.. నిమ్మగడ్డ పదవీ కాలంలో ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఒత్తిడి తెచ్చినా ఆయన.. తన పదవీ కాలం ముగిసిపోతూండటంతో సాధ్యం కాదని నిర్వహించలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత పదవి చేపట్టిన నీలం సహాని .. మొదటి రోజే నోటిఫికేషన్ జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు .. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం...పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. సింగిల్ జడ్జి ధర్మాసనం నోటిఫికేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది. సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పింది. ఆ తరవాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా.. కౌంటింగ్‌కు అనుమతివ్వాలా.. నిర్ణయం తీసుకోనున్నారు.
ఒక వేళ డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తే.. బంధనల ప్రకారం.. నాలుగు వారాల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందన్నదానిపైనా మండల.. జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.