MP Raghu Rama Krishna Raju: వైసీపీ పాలనపై ఎంపీ రఘురామ పిటిషన్ - అవినీతిపై విచారణ కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం
MP Raghurama Pil: ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ లో కోరారు.
ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై పూర్తిగా పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసుపైనా
మరోవైపు, సీఎం జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతోంది. అయితే విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. చార్జిషీట్లు దాఖలు చేసి పదేళ్లైనా ఇప్పటికీ ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కింది కోర్టు కొట్టి వేస్తే పై కోర్టుకు వెళ్తున్నారు. ఇలా టైం కరిగిపోతోంది. ఈ కేసుల విచారణలు ఆలస్యమవుతున్నాయని.. వేరే రాష్ట్రానికి తరలించాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజా ప్రతినిధులపై ఉన్న తీవ్రమైన అభియోగాల కేసుల్ని ఏడాదిలోగా తేల్చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందు కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం చొరవ తీసుకున్నారు. కానీ, తర్వాత కూడా మామూలు పరిస్థితికే వచ్చింది. గతంలో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో జరిగేది. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో విచారణ ఆగిపోయింది. ఆ తర్వాత మరింత నెమ్మదిగా విచారణ సాగుతోంది. ఈ క్రమంలో జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని హైదరాబాద్ లో విచారణ అయితే జాప్యం ఎక్కువవుతుందని భావించి రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు.
రెబల్ ఎంపీగా
నిజానికి వైసీపీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి రెబల్ గా మారారు. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయన్న ఓసారి ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో రఘురామ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమయ్యారు. ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పార్టీ ఫిరాయించలేదు. ఈ కారణంగా వేటు పడలేదు. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. దీంతో అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు.
గతంలోనూ
సీఎం జగన్ పై గతంలోనూ ఎంపీ రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో నిందితులైన వారికి వివిధ పదవులు కట్టబెట్టడం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఇందుకు సాక్ష్యాలుగా కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ విచారణకు రావడం లేదు.
Also Read: 'ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టడమే లక్ష్యం' - ఐసీఐడీ ప్లీనరీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు