MP Raghurama: షర్మిల కాంగ్రెస్‌లో కలిపేస్తే ఏపీలో వైసీపీ బొక్కబోర్లా పడ్డట్లే - ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు
శుక్రవారం (ఆగస్టు 11) రఘురామక్రిష్ణం రాజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తన అన్నను సీఎం చేయడంలో వైఎస్ షర్మిల పాత్ర కీలకం అని రఘురామ అన్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వార్తలు విపరీతంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు బలం చేకూర్చేలా ఆమె తరచూ కాంగ్రెస్ నేతల్ని కలుస్తున్నారు. నేడు కూడా వైఎస్ షర్మిల మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలవనున్నారు. అయితే, ఈ విలీనంపై ఏపీలో వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఏపీలో వైఎస్ఆర్ సీపీకి ఇబ్బందులు తప్పవని అన్నారు. శుక్రవారం (ఆగస్టు 11) రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
తన అన్నను సీఎం చేయడంలో వైఎస్ షర్మిల పాత్ర కీలకం అని రఘురామ అన్నారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆమె తల్లి విజయమ్మ కూడా షర్మిల వెంటే ఉంటుందని అన్నారు. సీఎం సొంత చెల్లి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే, తల్లి పరోక్షంగా కుమార్తెకు మద్దతు పలికితే.. ఇక్కడ సీఎంను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. షర్మిల పార్టీని కలిపేస్తే గతంలో ఊహించిన 25 సీట్లు కూడా జగన్ కి ఏపీలో రాబోవని అన్నారు.
యముడికి మొగుడు సినిమా తరహాలో రాజశేఖర్ రెడ్డి ఒకవేళ మళ్లీ భూమ్మీదికి వస్తే చచ్చినా జగన్ కు ఓటు వేయ్యరని రఘురామక్రిష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. షర్మిల వైఎస్ కు ప్రియ పుత్రికగా తండ్రి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ లో చేరడం సమంజసమే అని అన్నారు. గత ఎన్నికల్లో ఆమె ఏపీ ఓటర్లను గణనీయంగా ప్రభావితం చేశారని గుర్తు చేశారు. షర్మిలను అభిమానించే వారు, క్రైస్తవులు ఆమె ఉన్న పార్టీకే వేస్తారని రఘురామ అన్నారు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ బొక్కబోర్లా పడడం ఖాయమని, ఆ సమయానికి తాను ఇలా బొక్కబోర్లా పడే పార్టీలో ఉండనని అన్నారు.