Raghurama: క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసింది.. ఉద్యోగులకు సీఎం శఠగోపం పెట్టారు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉగ్యోగులు, భయపడే వైసీపీ నేతలను మార్చుకోవాలని సీఎం జగన్ కు సూచించారు. ఎప్పుడైనా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారితోనే మంచి జరుగుతుందని.. అలాంటి వారని తెచ్చుకోవాలని హితవు పలికారు. క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు సీఎం జగన్ శఠగోపం పెట్టారని విమర్శించారు. క్షవరం అయితే గానీ.. వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ దివాళా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉందని రఘురామ అన్నారు. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అనేలా పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఉన్న పీఆర్‌సీ కొనసాగితే చాలు అనేలా ఉద్యోగులు భావిస్తున్నారని.. తనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పోరాడాలన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు మళ్లీ గెలిపించాలని కోరారు.
నర్సాపురం టూర్ క్యాన్సిల్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతి పండుగను సొంత ఊరిలో చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నారు. సీఐడీ పోలీసులు హైదరాబాద్ ఇంట్లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో తనను అరెస్ట్ చేసే వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని రఘురామ అనుమానించారు. మొదట ఆయనకు పదమూడో తేదీనే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. రఘురామ నిరాకరించడంతో మళ్లీ పదిహేడో తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై ఆయన న్యాయనిపుణులతో మాట్లాడేందుకు బుధవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లిపోయారు.
ప్రతి ఏడాది రఘురామకృష్ణరాజు సొంత ఊరు భీమవరంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సంప్రదాయ కోడి పందేల్లో పాల్గొంటారు. అనారోగ్యం కారణంగా కొంత కాలం.. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీతో విభేదాల కారణంగా మరికొంత కాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఆయన నర్సాపురంలో అడుగుపెట్టలేదు. ఈ మధ్య కాలంలో ఒకటి, రెండు సార్లు ఆయన నర్సాపురం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నా .. ఆయన పర్యటనకు ముందే పలు కేసులు నమోదు కావడంతో చివరికి వెనక్కి తగ్గారు. ఆయా కేసుల్లో హైకోర్టు నుంచి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నా కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందారు.