TDP పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు, వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
Andhra Pradesh News: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. లోక్ సభ సమావేశాల్లో పార్టీ వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.
TDP parliamentary party | అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu)ను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేశారు. అదే విధంగా లోక్‌సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా దగ్గుమల్ల ప్రసాద్ రావు, బైరెడ్డి శబరి లను చంద్రబాబు నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ విప్ గా గంటి హరీష్ లను నియమించారు. ఈ మేరకు పార్టీ శనివారం (జూన్ 22న) ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏపీకి నిధులపై ఫోకస్ చేయాలి: ఎంపీలతో చంద్రబాబు
లోక్ సభలో తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీలలు ఉన్నారని, రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.