వైసీపీ అవమానాలపై 2021 నవంబర్ 19న చంద్రబాబు ఆగ్రహించి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని ఆలౌట్ చేసి సీఎంగా ప్రమాణం చేసి సభకు వచ్చారు. సీఎంగా సభకు సగర్వంగా వచ్చిన చంద్రబాబు ముందుగా అసెంబ్లీ గుమ్మానికి నమస్కరించారు. తర్వాత సభ ద్వారం వద్ద కొబ్బరి కాయ కొట్టి సభలో అడుగు పెట్టారు. చంద్రబాబు సభలోకి అడుగు పెట్టే క్షణం కోసం టీడీపీ శ్రేణులు రెండున్నరేళ్లుగా ఎదురు చూశారు. సభకు వచ్చిన చంద్రబాబుకు వేద పండితులు మంత్రోచ్ఛరణతో సభలోకి తీసుకెళ్లారు. సీఎం ఛాంబర్‌లో కూర్చున్న చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించారు. నవ్వుతూ అందరికి నమస్కారం చేస్తూ అసెంబ్లీ సమావేశ మందిరంలోకి చంద్రబాబు ప్రవేశించారు. సభలోకి చంద్రబాబు ప్రవేశించడంతో గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యులంతా నినాదాలు చేశారు. నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. నాటి శపథం వీడియో ఇవాళ్టి ప్రమాణ స్వీకారం వీడియో రెండూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.